ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌

24 Apr, 2022 05:14 IST|Sakshi

2.1 దాటిన ఆర్‌ వేల్యూ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వారంలో ఆర్‌–వేల్యూ 2.1ని దాటిందని ఐఐటీ మద్రాస్‌ అంచనా వేసింది. జాతీయ స్థాయిలో ఇది 1.3 మాత్రమేనని తెలిపింది. ఐఐటీ మద్రాస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ కంప్యూటేషనల్‌ మేథమెటిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ విభాగాధిపతులు ప్రొఫెసర్‌ నీలేశ్‌ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్‌ ఎస్‌.సుందర్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఆర్‌–వేల్యూ 2.1కు చేరుకోవడాన్ని బట్టి ఢిల్లీలో నాలుగో వేవ్‌ మొదలైందన్న అంచనాకు రావడం తొందరపాటే అవుతుందన్నారు.

‘ప్రస్తుతానికి ఒక్కో కరోనా బాధితుడి ద్వారా ఇద్దరికి వైరస్‌ వ్యాప్తి చెందుతోందని మాత్రమే ఆర్‌–వేల్యూ ద్వారా చెప్పగలం. ప్రజల్లో వ్యాధి నిరోధకత స్థాయిలు, జనవరిలో థర్డ్‌వేవ్‌ సమయంలో వైరస్‌ బారిన పడిన వారు మళ్లీ వ్యాధికి గురవుతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అందుకే వ్యాప్తి అంచనాకు కొంత సమయం పడుతుంది’అని వారన్నారు. ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో స్వల్ప స్థాయిలో కేసులు వెలుగులోకి వస్తున్నందున వ్యాప్తి తీవ్రతను ఊహించలేమని చెప్పారు. ఢిల్లీలో తాజాగా 1,042 కరోనా కేసులు బయటపడగా పాజిటివిటీ రేట్‌ 4.64%గా ఉంది.  

దేశంలో కొత్త కేసులు 2,527  
దేశంలో ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 2,527 కరోనా కేసులు బయటపడటంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 4,30,54,952కు చేరుకున్నాయని కేంద్రం శనివారం వెల్లడించింది. అదే సమయంలో, మరో 33 మంది బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,22,149కు చేరుకున్నట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 838 యాక్టివ్‌ కేసులు నిర్థారణ కాగా మొత్తం యాక్టివ్‌ కేసులు 15,079 అయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.04%గా ఉన్నాయని తెలిపింది.  

మరిన్ని వార్తలు