రెండు రోజులుగా తల్లి శవం పక్కనే పసిబిడ్డ.. ఆఖరికి

1 May, 2021 14:08 IST|Sakshi
బిడ్డకు పాలు పడుతున్న మహిళా పోలీసులు(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)

తల్లి మృతదేహం పక్కనే రెండ్రోజులుగా చిన్నారి

ఆకలితో అలమటించిన పాపాయి

తల్లిమనసు చాటుకున్న మహిళా పోలీసులు

ముంబై: మహమ్మారి కరోనా మానవాళికి తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఎన్నెన్నో విషాద ఘటనలకు కేంద్ర బిందువుగా మారుతోంది. కరోనా సోకడం కంటే ముందు అది ఎక్కడ అంటుకుంటుందోన్న భయమే మరింతగా ప్రజలను వణికిస్తోంది. మానవత్వాన్ని మంటగలుపుతోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన 18 నెలల పాపాయితో కలిసి పుణెలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన ఆమె శనివారం మృత్యువాతపడింది.

ఈ విషయం గమనించినప్పటికీ కరోనా భయంతో ఇరుగుపొరుగు వారు ఎవరూ ఆమె దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. సదరు మహిళ ఒకవేళ కరోనాతో మరణించినట్లయితే తమకు కూడా వైరస్‌ సోకుతుందన్న భయంతో మిన్నకుండిపోయారు. దీంతో, రెండురోజుల పాటు ఆమె శవం ఇంట్లోనే ఉంది. ఆలనాపాలనా చూసేవాళ్లు లేక ఆ పాపాయి తల్లి మృతదేహం పక్కనే ఆకలితో ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో చిన్నారి బాధను చూడలేక ఇంటి యజమాని ఎట్టకేలకు పోలీసులకు ఫోన్‌ చేయడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నారు. పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలు తాగించి మానవత్వం చాటుకున్నారు.

తల్లిమనసు చాటుకున్న మహిళా కానిస్టేబుళ్లు
ఈ విషయం గురించి కానిస్టేబుల్‌ సుశీల గభాలే మాట్లాడుతూ.. ‘‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఎనిమిది, మరొకరికి ఆరేళ్లు. ఆ చిన్నారిని చూడగానే నా కన్న బిడ్డల్నే చూసినట్లు అనిపించింది. బాగా ఆకలిగా ఉన్నాడు కదా. పాలు పట్టగానే గబగబా తాగేశాడు’’ అని తల్లి మనసు చాటుకున్నారు.

ఇక మరో కానిస్టేబుల్‌ రేఖ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. కాస్త జ్వరం ఉంది. కానీ డాక్టర్‌ ఫరవాలేదన్నారు. పాలు తాగించడంతో పాటు నీళ్లల్లో బిస్కెట్‌ ముంచి తనకు తినిపించాం. కరోనా నిర్ధారణ పరీక్ష కోసం తనను ప్రభుత్వాసుపత్రికి తరలించాం’’ అని పేర్కొన్నారు. మృతురాలి భర్త పని నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాడని, అతడి రాక కోసం ఎదరుచూస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. కాగా సదరు మహిళ కోవిడ్‌తో మరణించిందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

చదవండి: భార్యను కలిసేందుకు క్వారంటైన్‌ నుంచి పరార్‌.. చివరికి!

>
మరిన్ని వార్తలు