కోవిడ్-19 రోగుల‌కు ఆక్సీమీట‌ర్లు ఎందుకు అవసరం?

11 May, 2021 16:29 IST|Sakshi

దేశంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తుంది. ఈ కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుండటంతో చాలా మంది కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ఏకంగా మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా సోకిన వారి శరీరంలో ఆక్సిజన్ ఎంత స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే వైద్యులు వారికి సకాలంలో ఆక్సిజన్ అందించడం ద్వారా వారిని కాపాడవచ్చు. ఆసుపత్రులలో అయితే ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. 

అయితే, హోమ్ ఐసోలెష‌న్‌లో ఉన్న కరోనా భాదితులు తప్పనిసరిగా పల్స్ ఆక్సీమీట‌ర్‌ పరికరాన్ని తీసుకోవాలి. దీని ద్వారా శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పరీక్షించుకోవచ్చు. అయితే వీటి వాడకంపై నిపుణులు భిన్నమైన అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి రీడింగ్ ను త‌ప్పు చూపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వీటి పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది.

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ అనేది చేతిలో ఒదిగిపోయే ఒక చిన్న ప‌రిక‌రం. చూడటానికి క్లిప్‌లా క‌నిపించే ఈ ప‌రిక‌రాన్ని ఎక్కువ శాతం కుడి చేతి మధ్య వేలికి లేదా చూపుడు వేలికి అమరుస్తారు. దీన్ని కొన్ని సార్లు మిగతా వెళ్లకు, కాలి వేళ్లు, చెవికి తక్కువ సందర్బాలలో అమ‌రుస్తుంటారు. దీని వల్ల గుండె నుంచి శరీరంలోని మిగతా భాగాలకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తుంది అనేది ఆక్సీమీట‌ర్‌తో తెలుసుకోవ‌చ్చు. కేవలం కరోనా కోసం మాత్రమే కాకుండా ఆస్థ‌మా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌, ర‌క్త హీన‌త‌, గుండె జ‌బ్బుల చికిత్స‌లో దీని అవ‌స‌రం ఎక్కువ ఉంటుంది. 

దీనిని వేలికి పెట్టుకున్న కొన్ని సెక‌న్ల తర్వాత వారి శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిని ఇది నమోదు చేస్తుంది. ఇది Spo2 యూనిట్ల‌లో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుంది. ఆరోగ్యవంతుల ఆక్సిజన్ స్థాయి 95 శాతం, అంత‌కంటే ఎక్కువగా ఉంటుంది. ఆక్సీమీట‌ర్‌ చేతికి పెట్టుకున్నాక 3 నిమిషాల పాటు 95 శాతం కంటే ఎక్కువ ఒకే రీడింగ్ చూపిస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. ఆ పరికరంలో బ్యాటరీ తక్కువ ఉన్న సమయాలలో రీడింగ్ తప్పుగా చూపించే అవకాశం ఉంది. అలాగే, ఈ ప‌రిక‌రం గుండె కొట్టుకునే రీడింగ్‌ని కూడా మనకు చూపిస్తుంది. ఆరోగ్యవంతుల‌కు నిమిషానికి 60 నుంచి 100 సార్లు హార్డ్ బీటింగ్ ఉంటుంది. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండ‌టం మంచిది. గ‌తేడాది క‌రోనా సోకి, హోమ్ ఐసోలెష‌న్‌లో ఉన్న రోగుల‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ఆక్సీమీట‌ర్‌ను ఉచితంగా అందించింది.

చదవండి:

కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?

>
మరిన్ని వార్తలు