కోవిడ్‌పై యుద్ధం ప్రకటించిన గ్రామాలు

14 May, 2021 08:28 IST|Sakshi

చర్యలకు ఉపక్రమించిన పంచాయతీరాజ్‌ సంస్థలు .

పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటున్న స్థానిక ప్రభుత్వాలు 

మాస్కుల ధారణ, డోర్‌ టు డోర్‌ పర్యవేక్షణలపై ప్రత్యేక దృష్టి 

మహమ్మారి కట్టడిలో పంచాయతీలు విజయవంతం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మొదటగా నగరాల్లో తన ప్రభావాన్ని చూపగా.. తాజాగా గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై పోరు గ్రామాలు యుద్ధం ప్రారంభించాయి. పలు రకాల చర్యలను చేపట్టి కరోనాను కట్టడి చేసే యత్నాల్లో మునిగిపోయాయి. మాస్కులు ధరించడం నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వైరస్‌ను రూపుమాపేందుకు గ్రామ పంచాయతీలు సిద్ధమయ్యాయి. పలు రాష్ట్రాల్లో చర్యలు ఇలా ఉన్నాయి.
 
హిమాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలో కొత్తగా ఈ సంజీవని ఓపీడీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉచితంగా ఆన్‌లైన్‌ మెడికల్‌ కన్సల్టేషన్‌ సదుపాయం కల్పించారు. వ్యాధులు ఉన్న వారు వెంటనే వైద్య సూచనలు పొందేందుకు ఇది ఉపయోగపడుతోంది.  
కేరళ: స్థానిక సంస్థల సహాయంతో కమ్యూనిటీ డెవెలప్‌మెంట్‌ సొసైటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. కుడుంబశ్రీగా పిలుస్తున్న ఈ కార్యక్రమంలో పేద మహిళలు పాలుపంచుకోవడం గమనార్హం. దీంతో పాటు రెండు ఛాంబర్‌లు కలిగిన ఆటో కార్‌ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు.  
ఆంధ్రప్రదేశ్‌: గ్రామ పంచాయతీల్లో కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేశారు. మాస్కు లేకపోతే ప్రవేశాన్ని నిషేధించడంతో పాటు, ఇంటింటికీ తిరిగి ప్రజల పరిస్థితులను పరిశీలిస్తున్నారు.  
తెలంగాణ: గ్రామాల్లో ఇంటింటి సర్వే జరిపి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచడం, పరీక్షలు నిర్వహించడం చేస్తున్నారు. 
హరియాణా: గ్రామాల్లో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల నుంచి చేరుకుంటున్న వలస కార్మికుల కోసం ప్రత్యేక క్వారంటైన్, ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.  
గుజరాత్‌: గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి ఉష్ణోగ్రతను, ఆక్సిమీటర్‌ ద్వారా ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకుంటున్నారు. గ్రామ యోధ సమితా ద్వారా యాంటి జెన్‌టెస్ట్‌ కిట్‌లను అందించి వైరస్‌ సోకిన వారికి సేవలు అందిస్తున్నారు.  
ఉత్తరప్రదేశ్‌: గ్రామాల్లో నిగ్రాణి సమితి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. పరిశుభ్రతను పెంచడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.  
ఉత్తరాఖండ్‌: బ్లాక్‌ స్థాయిలో పర్యవేక్షణలు జరిపేందుకు విలేజ్‌ మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. రోగులకు అన్నిరకాల సదుపాయలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.  
పశ్చిమ బెంగాల్‌: ఎన్‌జీఓల సాయంతో స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానిక మార్కెట్లలో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పేదలకు రేషన్‌ను ఎలాంటి సమస్యలు లేకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  
మధ్యప్రదేశ్‌: గ్రామాల్లో కరోనాను కట్టడి చేసేందుకు కంటైన్‌మెంట్‌ జోన్ల పద్ధతిని పాటిస్తున్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లుగా విభజించి రోగులకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు.  
మహారాష్ట్ర: నా కుటుంబం నా బాధ్యత అనే స్లోగన్‌తో ప్రజల్లో అవగాహన కల్పించే యత్నాలు సాగుతున్నాయి. కరోనా ప్రివెన్షన్‌ కమిటీలను ఏర్పాటు చేసి డోర్‌ టు డోర్‌ కర్యాక్రమం ద్వారా రోగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.  
పంజాబ్‌: ప్రతి గ్రామంలో విలేజ్‌ మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. తిక్రి పెహ్రాస్‌ పేరుతో నైట్‌కర్ఫ్యూ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.  
అరుణాచల్‌ప్రదేశ్‌: పబ్లిక్‌ ప్రదేశాల్లో శానిటైజేషన్‌ సరిగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పర్యవేక్షణ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు.
బిహార్‌: గ్రామాల్లో మాస్కులు ధరింపజేసేందుకు ప్రభుత్వమే మాసు్కలను ఉచితంగా అందిస్తోంది. మాసు్కలను ఉత్పత్తి చేయడం ద్వారా ఉపాధి మార్గాలను కల్పించే ప్రయత్నం చేస్తోంది.  
రాజస్తాన్‌: గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ కిట్లను అందిస్తూ రోగులు కరోనాపై పోరాడేందుకు ఊతం అందిస్తోంది.

చదవండి:

అన్నదాతలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీపికబురు

మరిన్ని వార్తలు