Coronavirus India Highlights: మూడు రెట్లు వేగంగా

19 Apr, 2021 05:54 IST|Sakshi

కరోనా పడగ నీడలో భారత్‌ 

మొదటి వేవ్‌ కంటే మూడు రెట్ల వేగంతో 

వెన్నులో వణుకుపుట్టిస్తున్న సెకండ్‌వేవ్‌

చిన్నారుల్నీ వదలని మహమ్మారి 

కొత్త వేరియెంట్లు, లక్షణాలతో జనం బెంబేలు

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: దేశాన్ని కరోనా కసిగా కాటేస్తోంది. మొదటి వేవ్‌ తర్వాత దాని కోరలు పీకామని భావించాం కానీ, అనూహ్యమైన రీతిలో మూడు రెట్ల వేగంతో విషం కక్కుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్‌లో రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కరోనా పడగ నీడలో బిక్కు బిక్కుమంటూ కాలం నెట్టుకొస్తున్నాం. ఫస్ట్‌ వేవ్‌ తర్వాత దేశంలో సెకండ్‌ వేవ్‌ ఎలా విజృంభిస్తోందో చూద్దాం. 

కరోనా మొదటి వేవ్‌ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో కొంత మేర విస్తరించింది. ప్రతీ రాష్ట్రంలోనూ హాట్‌స్పాట్స్‌ ఉన్నాయి. కానీ రెండో వేవ్‌ వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లోనే వైరస్‌ లోడు అధికంగా ఉంది. ఇండియా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఈ వారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొదటి వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో బయటపడితే, రెండో వేవ్‌లో సగం కేసులు  20 జిల్లాల్లోనే వెలుగు చూశాయి. 2020 ఆగస్టు–సెప్టెంబర్‌ మధ్య కరోనా మొదటి వేవ్‌ ఉధృతరూపం దాల్చినపుడు 75 శాతం కేసులు 60–100 జిల్లాలోనేయి. అదే సెకండ్‌ వేవ్‌లో మార్చి–ఏప్రిల్‌ నెలలో నమోదైన కేసుల్లో 75 శాతం కేసులు 20–40 జిల్లాల్లోనే బయటకొచ్చాయి.  

లక్షణాల్లేకుండా చుట్టేస్తోంది
గత ఏడాది తొలిసారిగా జనవరిలో కేరళలో తొలికేసు వచ్చింది. చైనా నుంచి దిగుమతి అయిన వైరస్‌ మాత్రమే అందరికీ సోకింది. కానీ రెండో దశ మొదలైనప్పట్నుంచి వైరస్‌ జన్యుక్రమం మార్చుకొని విశ్వరూపం చూపిస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా మ్యుటేషన్లతో పాటు రెండుసార్లు జన్యుక్రమం మార్చుకున్న భారత్‌ వైరస్‌ సార్స్‌ కోవ్‌–2 ద్వారా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సెకండ్‌వేవ్‌లో అత్యధికుల్లో లక్షణాలు కనపడటం లేదు. దాంతో తెలియకుండానే వీరు ఇతరులకు వైరస్‌ను అంటిస్తున్నారు. అంతేకాదు కొన్ని కేసుల్లో కరోనా నేరుగా ఊపిరితిత్తుల పైనే దాడి చేస్తోంది.  కేవలం మూడు రోజుల్లోనే ప్రాణాల మీదకి వస్తోంది.  

యువతపై ప్రభావం
కరోనా మొదటి వేవ్‌ పెద్దల్ని కాటేస్తే సెకండ్‌ వేవ్‌లో యువతకి ఎక్కువగా సోకుతోంది. ఢిల్లీలోని కరోనా రోగుల్లో 65 శాతం మంది 45 కంటే తక్కువ వయసు ఉన్న వారేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో సగం కేసులు 30–40 ఏళ్ల మధ్య వయసున్న వారినే సోకుతున్నాయి. మొదటి వేవ్‌లో కరోనా మరణాల్లో 60 ఏళ్లకు పైబడిన వారే 88శాతం మంది ఉన్నారు. ఇక కేసులు కూడా 60 శాతానికిపైగా 50 ఏళ్ల వయసున్న వారికే సోకింది. మొదటి వేవ్‌లో చిన్నపిల్లలకు కరోనా సోకిన కేసులు అరుదు. కానీ ఈసారి మార్చి నెలలోనే 80 వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు.  

వ్యాక్సినేషన్‌ సాగుతున్నా తగ్గని జోరు
మొదటి దశలో కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు మాత్రమే జరిగాయి. కానీ రెండో వేవ్‌ వచ్చేసరికి వ్యాక్సినేషన్‌ మొదలైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్, సీరమ్‌ సంస్థ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లను 45 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

నాడు అవగాహన లేమి.. నేడు నిర్లక్ష్యం
కరోనా మొదటి వేవ్‌లో ఈ వైరస్‌పై ఎవరికీ అవగాహన లేదు. లాక్‌డౌన్, క్వారంటైన్, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు పూసుకోవడం అన్నీ కొత్త. దీంతో గత ఏడాది లాక్‌డౌన్‌ ఎత్తేశాక జూలై– సెప్టెంబర్‌ మధ్య కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండో వేవ్‌ సమయానికి ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికీ వ్యాక్సిన్‌ వచ్చిందన్న ధీమా, కరోనా నిబంధనల్ని గాలికి వదిలేయడం, ప్రభు త్వం కూడా ఆర్థిక నష్టం జరగకూడదన్న ఉద్దేశం తో అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతినివ్వడం, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మార్చి నుంచి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.   

కరోనా రెండో వేవ్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదటి వేవ్‌లో ఒక కరోనా రోగిని కలుసుకున్న వారిలో 30 నుంచి 40% మందికి వైరస్‌ సోకే అవకాశాలుంటే, రెండో వేవ్‌లో 80 నుంచి 90% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలున్నాయి
- డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు