రెండు రోజుల్లో 90 వేల కేసులు

23 Mar, 2021 05:26 IST|Sakshi

పంజా విప్పుతున్న కరోనా

న్యూఢిల్లీ/మైసూరు/డెహ్రాడూన్‌: దేశంలో కేవలం రెండు రోజుల్లో బయటపడిన కేసుల సంఖ్య 90 వేలు దాటింది. గత 24 గంటల్లో 46,951 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 212 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,967 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,51,468 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.75 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,34,646గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 2.87   శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది.  

80% కేసులు ఆ రాష్ట్రాల్లోనే..
దేశంలో సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 80.5 శాతం కేసులు కేవలం అయిదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మహారాష్ట్రలో అత్యధికంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 1,78,00,438 కరోనా పరీక్షలు చేయగా అందులో 13.93% పాజిటివిటీ రేటు నమోదైంది. కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పింది. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య దేశంలో 4.50 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్‌ మరణం కూడా సంభవించలేదని తెలిపింది.

లాక్‌డౌన్‌ ఆలోచన లేదు..: కర్ణాటకలో లాక్‌డౌన్‌ వార్తలపై ఆరోగ్య మంత్రి కె. సుధాకర్‌ స్పందించా రు. ప్రస్తుతానికి లాక్‌డౌన్‌గానీ, సెమీ–లాక్‌డౌన్‌గానీ విధించే అవకాశం లేదని చెప్పారు. కాగా,  కరోనా కేసులు పెరుగుతుండటంతో మైసూరులో మినీ లాక్‌డౌన్‌ను విధించాల్సి ఉంటుందని,  ప్రజలు నిబంధనల్ని పాటించాలని కలెక్టర్‌ రోహిణి సింధూరి తెలిపారు.  కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ లేకుండా ఇతర రాష్ట్రాలవారు రావద్దన్నారు.

4–8 వారాల మధ్య కోవిషీల్డ్‌ రెండో డోసు
కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య విరామాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని గతంలో సూచించగా, ప్రస్తుతం దాన్ని 4 నుంచి 8 వారాలుగా సవరించింది. అంటే మొదటి డోసు తర్వాత 4–8 వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’ పంపిణీలో రెండు డోసుల మధ్య సవరించిన విరామాన్ని పాటించాలని సూచించారు. ఇలా తీసుకుంటే కరోనా నుంచి రక్షణ మరింత పెరుగుతున్నట్లు శాస్త్రీయమైన ఆధారాలు లభించాయని రాజేష్‌ భూషణ్‌ తెలిపారు. సవరించిన విరామం కోవాగ్జిన్‌ టీకాకు వర్తించదని  స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు