కరోనా కేసులు లక్ష దాటేశాయ్‌

8 Jan, 2022 03:42 IST|Sakshi
కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రి వద్ద అంబులెన్సుల రద్దీ

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 214 రోజుల తర్వాత రికార్డు స్థాయిలో మళ్లీ లక్షకి పైగా కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులోనే 1,17,100 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు 3,007 వచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఒకే రోజు లక్షకు పైగా కేసులు రావడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకుంది.

ఈ స్థాయిలో యాక్టివ్‌ కేసులు రావడం 120 రోజుల తర్వాత ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 302 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74% ఉంటే, గతవారం రోజుల పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. కరోనా రికవరీ రేటు 97.57శాతంగా ఉంది. గత ఏడాది జూన్‌ 7న దేశంలో తొలిసారిగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 17,335 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 17.73 శాతానికి పెరిగింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు శుక్రవారం వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

రోమ్‌ నుంచి వచ్చిన ఈ విమానంలో 285 మందికి పాజిటివ్‌ వస్తే, మరో 50 మంది కోవిడ్‌ పరీక్ష ఫలితం ఇంకా తెలియాల్సి ఉందని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వి.కె.సేథ్‌ చెప్పారు. కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉండడంతో అస్సాం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకోని వారు బహిరంగ ప్రదేశాలకు రాకూడదని ఆదేశించింది. హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్‌లోకి టీకా రెండు డోసులు తీసుకోని వారికి అనుమతిస్తే ఆయా యాజమాన్యాలకు రూ.25,000 జరిమానాగా విధిస్తామని హెచ్చరించింది.  

వ్యాక్సినేషన్‌ @150 కోట్లు
భారత్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. శుక్రవారం నాటికి దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్‌ టీకా పంపిణీ పూర్తయిందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో ఎన్నో జీవితాలను కాపాడినట్లయిందన్నారు. దేశంలోని అర్హుల్లో 91% మంది కనీసం ఒక్క డోసు టీకా వేయించుకోగా, 66% మందికి రెండు డోసులు పూర్తయిందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్‌లో అర్హులైన 22% మంది బాలబాలికలు టీకా వేయించుకున్నారని చెప్పారు.  ప్రికాషన్‌(ముందు జాగ్రత్త) డోస్‌ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదని, నేరుగా, ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం స్పష్టంచేసింది.  

మరిన్ని వార్తలు