పతాకస్థాయికి విపత్తు.. నేటి నుంచి మినీ లాక్‌డౌన్‌

26 Apr, 2021 08:46 IST|Sakshi

వారాంతపు కర్ఫ్యూతో స్తంభించిన రాష్ట్రం 

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా భూతం సరికొత్త రికార్డులను లిఖిస్తోంది. అందరి జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర కోవిడ్‌ చరిత్రలోనే అత్యధికంగా 34,804 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు 6,982 మంది కోలుకున్నారు. మరో 143 మంది ప్రాణాలు విడిచినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  

యాక్టివ్‌గా 2.62 లక్షలు  
ఇప్పటివరకు రాష్ట్రంలో 13,39,201 మందికి కరోనా సోకింది. అందులో 10,62,594 మంది కోలుకున్నారు. 14,426 మంది కన్నుమూశారు. ఇప్పటికి 2,62,162 మంది కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 1,492 మంది ఐసీయూలో ఉన్నారు. తాజాగా జిల్లాల వారీగా మరణాలు చూస్తే బళ్లారిలో 16, మైసూరులో 9, కలబురిగిలో 7, ధారవాడలో 6, తుమకూరులో 6, హాసనలో 4, మండ్యలో 3, మిగతా జిల్లాల్లో ఇద్దరు, ఒకరు చొప్పున కన్నుమూశారు. 

బెంగళూరులో 20,733  
ఐటీ సిటీ కరోనా ముట్టడితో నలిగిపోతోంది. నిత్యం  కోవిడ్‌ విస్తరిస్తూనే ఉంది. తాజాగా 20,733 మంది కరోనా బారినపడగా, 2,285 డిశ్చార్జిలు, 77 మరణాలు నమోదయ్యాయి. నగరంలో ప్రస్తుతం 1,80,542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

86 లక్షలు దాటిన టీకాలు  
రాష్ట్రంలో కొత్తగా 1,76,614 కరోనా టెస్టులు చేయగా, మొత్తం పరీక్షలు 2,47,22,862 కి పెరిగాయి.  
మరో 60,693 మందికి కరోనా టీకా వేశారు. ఇప్పటివరకు మొత్తం 86,61,038 మంది టీకా పొందారు.

వారాంతపు లాక్‌డౌన్‌ అమలు
రెండరోజుల పాటు రాష్ట్రం యావత్తు వారాంతపు లాక్‌డౌన్‌తో స్తంభించిపోయింది. శని, ఆదివారం కన్నడనాడు అంతటా బోసిపోయింది. రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు తప్ప మిగిలిన సమయం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ జనరద్దీతో దర్శనమిచ్చే వ్యాపార సముదాయాలు, మార్కెట్లు తదితరాలు కర్ఫ్యూ నీడలో ఉండిపోయాయి. ఆదివారం కూడా పోలీసులు అక్కడక్కడా లాఠీచార్జి చేశారు. 10 గంటల తరువాత కూడా బయట సంచరిస్తున్నారని బెంగళూరులో కేఆర్‌ మార్కెట్లో, కలబుర్గి, దావణగెరె తదితర ప్రాంతాల్లో జనంపై లాఠీలను ఝలిపించారు.  

నేటి నుంచి మినీ లాక్‌డౌన్‌  
సోమవారం ఉదయానికి లాక్‌డౌన్‌ ముగుస్తుంది, అయితే మినీ లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో  వ్యాపార లావాదేవీలకు అనుమతి ఉండదు. నిత్యావసరం కాని షాపులు, మాల్స్, థియేటర్లు మూతపడి ఉంటాయి. దీంతో వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మే 4 వరకు మినీ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.  

పల్స్‌ పోలియో మాదిరి టీకా: కుమార 
కరోనా వ్యాక్సిన్‌ను పల్స్‌ పోలియో తరహాలో ఇవ్వాలని జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ట్విట్టర్లో కోరారు. కర్ణాటక సర్కారు కూడా ప్రజలకు ఉచితంగా కోవిడ్‌ టీకా ఇవ్వాలన్నారు.

వాడవాడలా నిర్మానుష్యం 
తుమకూరు: వారాంతపు లాక్‌డౌన్‌ తుమకూరు నగరంతో పాటు జిల్లా అంతటా విజయవంతమైంది. ఆదివారం ఎవరూ రోడ్ల పైకి రాకపోవడంతో నిర్మానుష్యంగా కనిపించింది. షాపులు మొత్తం బంద్‌ చేసి ఇళ్ళకు పరిమితం అయ్యారు. కేఎస్‌ఆర్‌టీసి బస్సులు కూడా తక్కువగా తిరిగాయి. 

ఆనేకల్‌లో కర్ఫ్యూకి సంపూర్ణ మద్దతు
బొమ్మనహళ్లి:  ఆనేకల్‌ తాలూకాలో వీకెండ్‌ కర్ఫ్యూకి సంపూర్ణ మద్దతు లభించింది. తాలూకాలోని చందాపుర, అత్తిబెలి, సర్జాపుర ప్రాంతాల్లో ప్రజలు సహకరించారు. అత్యవసర సేవలు మినహాయించారు. జనజీవనం స్తంభించింది.   

బోసిపోయిన మండ్య
మండ్య: వారాంతపు లాక్‌డౌన్‌లో భాగంగా చక్కెర నగరిగా ప్రసిద్ధి చెందిన మండ్య జన సంచారం లేక బోసిపోయింది. ఆదివారం ఉదయం 6 నుంచి పది గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం కల్పించారు. అనంతరం దుకాణాలన్నీ మూతపడ్డాయి. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.  

మైసూరులో 
జిల్లాలో వారాంతపు కర్ఫ్యూకి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో సజావుగా ముగిసింది. ఆదివారం ఉదయం 6 గంటలనుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోళ్లతో వీధులు కిటకిటలాడాయి. ఆ తరువాత కూడా వ్యాపారం చేస్తున్న వారి షాపులను పోలీసులు మూసివేయించారు.

బిస్కెట్లు, నీరు వితరణ
బొమ్మనహళ్లి: మంగమ్మనపాళ్య బీజేపీ కార్యకర్తలు కూడ్లు, హోసపాళ్య వద్ద ఉన్న స్మశానవాటికలకు చేరుకుని అక్కడ వేచి ఉంటున్న వారికి నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు వితరణ చేశారు. బొమ్మనహళ్లి వార్డు అధ్యక్షుడు మధుసూదన్, బాబురెడ్డి, హోసపాళ్య చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.  

చదవండి: సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తోంది

మరిన్ని వార్తలు