కరోనా కల్లోలం: ఖాళీ అవుతున్న బెంగళూరు!

10 May, 2021 08:27 IST|Sakshi

కరోనా మృత్యు నర్తనం 

మరో 490 మంది కన్నుమూత 

తాజాగా 47,930 కేసుల నమోదు  

సాక్షి, బెంగళూరు: కర్ణాటకను కుదిపేస్తున్న కరోనా వైరస్‌ అభాగ్యులపై పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,930 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. రికార్డుస్థాయిలో మరో 490 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో వృద్ధులతో పాటు యువత, మధ్యవయస్కులు అధికంగా ఉండడం ఆందోళనకర పరిణామం. ఇక 31,796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 19,34,378 కి చేరగా, 13,51,097 మంది కోలుకున్నారు. మరణాలు 18,776 కి పెరిగాయి. 5,64,485 మంది కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు.  

బెంగళూరులో 20,897 కేసులు..  
ఉద్యాననగరిలో తాజాగా 20,897 కేసులు, 15,000 డిశ్చార్జిలు, 281 మరణాలు నమోదయ్యాయి.  
పాజిటివ్‌లు 9,50,893, డిశ్చార్జ్‌లు 5,92,465 కాగా, మరణాలు 8,057కి చేరాయి.  
3,50,370 మంది చికిత్స పొందుతున్నారు.  

32,590 మందికి టీకా..  
కొత్తగా 1,46,491 శాంపిళ్లు పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన టెస్టులు 2,70,18,220 కి పెరిగాయి. 
మరో 32,590 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. దీంతో మొత్తం టీకాలు 1,05,21,773 అయ్యాయి.  

జిల్లాల వారీగా తాజా మరణాలు..   
►బెంగళూరులో 281, బళ్లారిలో 21, శివమొగ్గలో 17, తుమకూరులో 17, చామరాజనగరలో 15, మైసూరులో 13, రామనగరలో 13, కలబురిగిలో 12 మంది కరోనా సోకి మరణించారు. 
  
సీఎంకు ప్రధాని ఫోన్‌..  
కరోనా నియంత్రణపై ప్రధాని నరేంద్రమోదీ సీఎం యడియూరప్పకు ఫోన్‌చేశారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మరి కొన్నిరోజుల్లో కన్నడనాట కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని, మరింత కఠినంగా లాక్‌డౌన్‌ విధించినట్లు సీఎం తెలిపారు. అనంతరం సీఎం మంత్రులతో భేటీ అయ్యారు. ప్రతి జిల్లాలో కోవిడ్‌ నిబంధనలు అమలు కావాలని సూచించారు.  

ఖాళీ అవుతున్న బెంగళూరు   
దొడ్డబళ్లాపురం: సోమవారం నుంచి కర్ణాటక పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వేల సంఖ్యలో జనం ఆదివారమే బెంగళూరు వదిలి పెట్టెబేడా సర్దుకుని సొంత ఊర్లకు బయలుదేరారు. జనతా కర్ఫ్యూ ప్రకటించిన నాటి నుండి బెంగళూరుకు జీవనోపాధికి వలస వచ్చిన జనం స్వంత ఊర్లకు వెళ్లడం ప్రారంభించారు. ఇప్పుడు లాక్‌డౌన్‌తోపాటు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఇక బెంగళూరులో బతకడం దుర్భరమని భావించిన జనం తండోపతండాలుగా ఊర్లకు బయలుదేరారు. ఆదివారం ఎక్కడ చూసినా జనం తట్టాబుట్టా సర్దుకుని వెళ్తున్న దృశ్యాలే కనబడ్డాయి. రైల్వేస్టేషన్‌ లు కిటకిటలాడాయి. హోసూరు, అత్తిబెలె, తుమకూరు రోడ్డులోని నవయుగ టోల్, గొరగుంటెపాళ్య వద్ద  వాహనాలు బారులు తీరాయి.   

చదవండి: 2 వారాలు సర్వం బంద్‌.. నేటి నుంచి పూర్తి లాక్‌డౌన్‌

మరిన్ని వార్తలు