పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్‌.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్‌

21 Apr, 2021 14:28 IST|Sakshi

ముంబై: భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది కోవిడ్‌-19 బారిన పడుతున్నారు. దీంతో ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తి కట్టడికై పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించడం వంటి చర్యలు చేపడతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 62,097 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 519 మంది కరోనాతో మరణించారు. 

ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన డాక్టర్‌ తృప్తి గిలాడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో నెటిజన్ల మనసును ద్రవింపజేస్తోంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెన్నడూ చూడలేదు. రోజురోజుకీ ఆశ చచ్చిపోతోంది. నాలాగే చాలా మంది డాక్టర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నా గుండె పగిలిపోతోంది. నన్ను బాధిస్తున్న విషయాల గురించి మీతో పంచుకుంటే నాకు కాస్త మనశ్శాంతి లభిస్తుందని భావిస్తున్నా. 

అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి. మీకు ఇంతవరకు కరోనా సోకకపోయినా, లేదంటే దానిని మీరు జయించినా సూపర్‌ హీరోలుగా ఫీలవ్వొద్దు. రోగనిరోధక శక్తి ఉంది కదా బయట తిరగొద్దు ప్లీజ్‌. ముఖ్యంగా యువత కూడా మహమ్మారి బారిన పడి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోంది. వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్లను కళ్లారా చూస్తూ కూడా ఏమీ చేయలేని దుస్థితి. నిజానికి అస్వస్థతకు గురైనా, లేదంటే అలా అనిపించినా బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు.

ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్ల కొరత చాలా ఉంది. ముందుగా మీరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లండి. మీ వైద్యుడితో ఫోన్‌లో సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరించండి. అంతేకాదు, చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అది సరైన పద్దతి కాదు. మీ కోసం ఎంతో మంది ఇక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. దయచేసి డాక్టర్లు, నర్సులు, రోగులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి. సామాజిక దూరం, మాస్కు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించండి’’అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

చదవండి: కరోనా రెండో దశ: కొత్తగా 2,95,041 పాజిటివ్‌ కేసులు

మరిన్ని వార్తలు