అప్పుడే పుట్టిన శిశువుకు పాజిటివ్‌.. తల్లికేమో నెగెటివ్‌, షాక్‌లో వైద్యులు

27 May, 2021 17:13 IST|Sakshi

లక్నో: దేశ‌వ్యాప్తంగా కరోనా వైరస్ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరినుంచి ఈ మహమ్మారి సోకుతుందో అనే భయం. ఈ నేప‌థ్యంలో త‌ల్లి క‌డ‌పులో నుంచి ఓ ఆడ శిశువు కరోనా పాజిటివ్‌తో ప్ర‌పంచంలోకి వ‌చ్చింది. ఇదిలా ఉండగా.. శిశువు తల్లికి మాత్రం నెగెటివ్‌ రావడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన యూపీలోని వారణాసిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే 24న పురిటి నొప్పులతో సుప్రియ అనే మహిళ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని ఎస్.ఎస్. ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్థారణ అయ్యింది. డెలివరీ చేసిన వైద్యులు మర్నాడు ఆమెకు పుట్టిన పాపకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యసిబ్బందితో పాటు సుప్రియ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దీనిపై సుప్రియ భర్త మాట్లాడుతూ.. ఇది వింతగా ఉంది. కరోనా పరీక్షల ఫలితాన్ని చూసి మా కుటుంబ సభ్యులందరిలోను గందరగోళం నెలకొంది. ఒక వేళ పరీక్ష ఫలితాలు తప్పుగా ఉన్నాయో లేదో మాకు అర్థం కాలేదు. వీటి గురించి తెలుసుకోవడానికి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కాల్స్‌ చేయగా ఆయన స్పందించడంలేదని ఆమె భర్త తెలిపాడు. అయితే, శిశువుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు బీహెచ్‌యూ రిజిస్ట్రార్ నీరజ్ త్రిపాఠి ధృవీకరించారు. ప్రస్తుతం తల్లి ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు. 

చదవండి: తుఫాన్‌ వస్తుంటే బయటకొచ్చావ్‌ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా

>
మరిన్ని వార్తలు