Covid-19: యోగాతో కోవిడ్‌ పేషెంట్లలో సత్ఫలితాలు!

7 May, 2022 05:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐసోలేషన్‌ కాలంలో ఆన్‌లైన్‌ యోగా క్లాసులకు హాజరైన కోవిడ్‌ పేషెంట్లలో 92 శాతంమందికి సత్ఫలితాలు కనిపించాయని ఢిల్లీ ఫార్మాసైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ యూనివర్సిటీ నివేదిక తెలిపింది. కోవిడ్‌ లక్షణాల నుంచి వీరిలో అత్యధికులు తక్షణ మెరుగుదల చూపారని తెలిపింది. కోవిడ్‌ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు ఢిల్లీ ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్‌ యోగా క్లాసుల సదుపాయం కల్పిస్తోంది. వీరిలో 88.9 శాతం మంది తమకు శ్వాస సమస్యల నుంచి విముక్తి లభించినట్లు చెప్పారని నివేదిక తెలిపింది. ఐసోలేషన్‌లో తాము చేపట్టిన ఆన్‌లైన్‌ యోగా తరగతులు దాదాపు 4,600మంది పేషెంట్లకు ఉపకరించాయని ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్‌ సిసోడియా చెప్పారు.  

మూలికా వ్యాక్సిన్‌ భేష్‌..
టొరెంటో: కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా మెడికాగో కంపెనీ రూపొందించిన మూలికాధార కోవిడ్‌ టీకా 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని క్లినికల్‌ గణాంకాలు వెల్లడించాయి. మొక్కల్లో ఉత్పత్తయ్యే కరోనా వైరస్‌ లాంటి రేణువు (సీవోవీఎల్‌పీ)లను ఎఎస్‌ఓ3 అనే సహాయ ఔషధంతో కలిపి ఈ టీకాను తయారు చేశారు. 24వేల మందిపై ఫేజ్‌3 ట్రయిల్స్‌ జరపగా 69.5 శాతం ప్రభావం చూపినట్లు తేలింది. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న వారిలో 74–78.8 శాతం ప్రభావం చూపింది. రోగుల్లో వైరల్‌ లోడు బాగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. టీకా సైడ్‌ ఎఫెక్టులు స్వల్పం నుంచి మోస్తరుగా ఉన్నట్లు తెలిపింది.

>
మరిన్ని వార్తలు