మరో 4,187 మంది బలి

9 May, 2021 06:22 IST|Sakshi

మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 2,38,270

24 గంటల్లో 4,01,078 మందికి కరోనా నిర్ధారణ

యాక్టివ్‌ కేసులు 37,23,446

22.17%కి చేరుకున్న పాజిటివిటీ రేటు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో తొలిసారి కరోనా సంబంధిత మరణాలు 4వేల మార్క్‌ను దాటేశాయి. 24 గంటల్లో 4,187 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దేశంలో  ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణించడం ఇదే మొదటిసారి. తాజాగా, కోవిడ్‌ మృతుల సంఖ్య 2,38,270కు చేరుకుంది. 24 గంటల్లో కర్ణాటకలో మొట్టమొదటి సారిగా 592 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో 898, ఉత్తరప్రదేశ్‌లో 372, ఢిల్లీలో 341, ఛత్తీస్‌గఢ్‌లో 208, తమిళనాడులో 197 మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి.  అదే సమయంలో ఒక్కరోజులో 4,01,078 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మే 7వ తేదీ వరకు దేశంలో 1,09,68,039 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గతేడాది జనవరి 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులను గుర్తించారు. అంటే గత 82 రోజుల్లో దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రెట్టింపైంది.

  మరోవైపు, దేశంలో 24 గంటల్లో 3,18,609 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 1,79,30,960కు చేరుకుంది. అదే సమయంలో, దేశంలో యాక్టివ్‌ కేçసుల సంఖ్య 37,23,446కు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 17.01%గా ఉంది. ప్రపంచంలో అమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 22.17%గా నమోదైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం చేసిన 18,08,344 కరోనా సంక్రమణ టెస్ట్‌లతో కలిపి ఇప్పటివరకు దేశంలో 30 కోట్లకు పైగా టెస్ట్‌లు పూర్తయినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.
భువనేశ్వర్‌లో వాహనదారునికి కోవిడ్‌
టీకా ఇస్తున్న దృశ్యం

మరిన్ని వార్తలు