Covid-19: వారికి ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి

25 Dec, 2022 05:32 IST|Sakshi
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో కరోనా టెస్టులు

చైనా, జపాన్, ద.కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ నుంచి వస్తే తప్పనిసరి

గాంధీనగర్‌/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది.  

ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్‌
ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్‌ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్‌ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్‌ టెస్ట్‌ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌ తప్పదు.  

రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఆక్సిజన్‌ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్‌ ఆక్సిజన్, ఆక్సిజన్‌ సిలిండర్లు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్‌ఏ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు.

కొత్తగా 201 కేసులు
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది.  

మరిన్ని వార్తలు