రెండు డోసులకే ప్రాధాన్యం ఇవ్వాలి

5 Dec, 2021 06:30 IST|Sakshi

శాస్త్రవేత్తల అభిప్రాయాలు

న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాటానికి ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు సూచించారు. బూస్టర్‌ డోసులు ఇవ్వాలని ఇన్సాకాగ్‌ చేసిన సిఫారసులు నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడానికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

టీకా రక్షణలోకి ప్రజలందరూ వెళితే కోవిడ్‌పై పోరాటం సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. గత ఆరునెలలుగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ విస్తృతం చేసిందని ఇలాంటి సమయంలో మళ్లీ బూస్టర్‌ డోసులకి వెళ్లడం అంటే కరోనా రక్షణ ఛత్రం నుంచి వెనక్కి మళ్లడమేనని ఇమ్యూనాలజిస్ట్‌ వినీత బాల్‌ ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

‘భారత్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి బాగానే ఉంది. అందుకే ఇంకా రెండో డోసు తీసుకోని వారికి, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి టీకా ఇచ్చే అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి’ఆమె సూచించారు. ఎన్ని వ్యాక్సిన్‌లు వేసుకున్నా, బూస్టర్‌ డోసులు తీసుకున్నా అవన్నీ తాత్కాలికమేనని మాస్కు ఎల్లవేళలా ధరించడమే కోవిడ్‌పై బ్రహ్మాస్త్రంగా పని చేస్తుందని మహారాష్ట్ర కోవిడ్‌–19 టాస్క్‌ ఫోర్స్‌ సభ్యుడు వసంత్‌ నగ్వేకర్‌ తెలిపారు. కరోనా వ్యాప్తిని మాస్కులు 53% నిరోధిస్తాయని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు