కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్

3 Aug, 2020 12:12 IST|Sakshi

కరోనా టీకా ట్రయల్స్ కు డీసీజీఐ  అనుమతి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్  2, 3 దశల హ్యూమన్ ట్రయల్స్

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఊరటనిచ్చే ఒక శుభపరిణామం చోటు చేసుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.  లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు. కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

వ్యాక్సిన్ పరీక్షలకు సంబంధించిన డేటా, ఫలితాలు, ప్రోటోకాల్ పై  నిపుణుల కమిటీ సంతృప్తి చెందిందని, వారి అభిప్రాయం ఆధారంగా డీసీజీఐ భారతదేశంలో పరీక్షలకు అనుమతి ఇచ్చిందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు వెంటనే టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని, త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని ఎస్‌ఐఐ సీఈవో అదార్ పూనవల్లా ప్రకటించారు. కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి అతిపెద్ద టీకా తయారీ సంస్థ ఎస్ఐఐ, బయోఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ టీకాపై యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయి. అధికారిక గణాంకాల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 38,135 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తర్వాత కేసుల సంఖ్యలో భారత్ మూడోస్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు