Lockdown Update: ఈనెల 23 వరకు పొడిగింపు: సీఎం

7 Aug, 2021 08:36 IST|Sakshi

లాక్‌డౌన్‌పై సీఎం స్టాలిన్‌ వెల్లడి

వారాంతపు మూడురోజులు

ప్రార్థనాలయాల మూత

16 నుంచి వైద్య, నర్సింగ్‌ కళాశాలలకు అనుమతి

30 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితాలు 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అదనపు ఆంక్షలు విధిస్తూ లాక్‌డౌన్‌ను ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగించింది. అదేవిధంగా వారాంతం మూడు రోజులు ప్రార్థనాలయాల్లోకి భక్తుల ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నెల 16 నుంచి వైద్య, నర్సింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.  

సాక్షి ప్రతినిధి, చెన్నై :  రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వైద్య నిపుణులతో కలిసి జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు, వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు, క్వారంటైన్‌ జోన్ల స్థితిగతులపై సమీక్షించారు. 

సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు 
రాష్ట్రంలో పాఠశాలలు తెరవాల్సిన ఆవశ్యకతను వైద్య నిపుణులు ముఖ్యమంత్రికి వివరించారు. నెలల తరబడి ఇళ్లలోనే ఉంటూ ఆన్‌లైన్‌ పాఠాలు వినడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని వివరించారు. అంతేగాక ఆన్‌లైన్‌ క్లాసులు అందరికీ అందుబాటులో లేవని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను విన్న సీఎం స్టాలిన్‌ సెపె్టంబర్‌ 1వ తేదీ నుంచి 9, 10, 11, 12 తరగతులను ఒకే సమయంలో 50 శాతం మంది విద్యార్థులతో నిర్వహించాలని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూ ళ్లు తెరవవచ్చని చెప్పారు. స్కూళ్లు తెరిచే విషయంలో చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, వైద్య సంబంధిత కాలేజీలు ఈ నెల 16వ తేదీ నుంచి పనిచేసేందుకు అనుమతించారు.  

ఇంకా కొన్ని  

  • శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాలు మూత. 
  • మాంసం, చేపల దుకాణాలను వేర్వేరుగా నిర్వహించాలి. 
  • దుకాణాల ప్రవేశద్వారం వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజర్‌ వాడడం, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలకు చర్యలు. 
  • స్వేచ్ఛగా బయటి గాలి వచ్చేలా దుకాణాలు, షోరూంల నిర్వహణ. 
  • క్వారంటైన్‌ జోన్లలో అత్యవసర పనుల కోసమే జనసంచారానికి అనుమతి. వైద్యపరమైన సేవలకు మినహా ఇతరుల రాకపోకలపై నిషేధం. 
  • కరోనా లక్షణాలు కనపడగానే సమీపంలోని ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు తప్పనిసరి. ఇవేగాక ఇప్పటి వరకు అమలులో ఉన్న ఆంక్షలు యధాతథంగా కొనసాగుతాయి. 

      
30 నిమిషాల్లో ఫలితం వచ్చేలా
విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చే ప్రయాణికులకు ‘ర్యాపిడ్‌ కరోనా టెస్ట్‌’ పరికరం ద్వారా పరీక్షలు జరిపి 30 నిమిషాల్లోనే ఫలితాలు అందించే విధానాన్ని చెన్నై విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రూ.900 వసూలు చేసి ఆరీ్టపీసీఆర్‌ పరీక్షలు చేసే విధానం కొంతకాలంగా కొనసాగుతోంది. ఫలితాల వెల్లడికి సుమారు 4 గంటలు పడుతోంది. ఇకపై అంత జాప్యం ఉండదని, ‘ర్యాపిడ్‌ కరోనా టెస్ట్‌’ పరికరాన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చామని చెన్నై విమానాశ్రయ అధికారి తెలిపారు.    
చదవండి: New Zonal‌ Policy: తెలంగాణ ఉద్యోగుల కేడర్లు ఖరారు

మరిన్ని వార్తలు