45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా!

19 Mar, 2021 01:59 IST|Sakshi

దేశంలో కేసులు పెరుగుతుండటంతో కేంద్రం యోచన

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతుండటం, ప్రాధాన్యతావర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇకపై, 45 ఏళ్లు పైబడిన అందరినీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో చేర్చాలనే యోచన చేస్తోంది. దీనిపై కసరత్తు కొనసాగుతోందనీ, అంతిమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని జాతీయ కోవిడ్‌–19 నిర్వహణ బృందం(నెగ్‌వ్యాక్‌) సభ్యుడు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు చెందిన సమీరన్‌ పాండా చెప్పారు.

దేశంలో వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధు్దలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. దీంతో, వ్యాక్సినేషన్‌ గ్రూప్‌లోకి మరింత మందిని చేర్చాలంటూ తెలంగాణ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మిగతా వయస్సుల వారిని కూడా వ్యాక్సినేషన్‌ గ్రూప్‌లో చేర్చే విషయమై ప్రస్తుతం వివిధ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం టీకా అందిన 3.5 కోట్ల మందికిగాను 1.38 కోట్ల మంది 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటిన ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి మొదటి డోసు అందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో రోజుకు 1.25 లక్షల మందికి
దేశ రాజధానిలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న కోవిడ్‌–19 కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో రోజుకు టీకా పంపిణీ అయ్యే వారి సంఖ్యను 40 వేల నుంచి 1.25 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. గడిచిన మూడు రోజులుగా రోజుకు 500 చొప్పున కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, ఇవి ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటాయన్నారు. నిబంధనలను సడలించి, అందరికీ టీకా అందుబాటులోకి తేవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోకి అందరినీ చేర్చి, డోసులను అవసరమైన మేర అందుబాటులో ఉంచితే ఢిల్లీలో మూడు నెలల్లో అందరికీ టీకా అందుతుందన్నారు.

మరిన్ని వార్తలు