తొలిరోజు 1.65 లక్షల మందికి వ్యాక్సిన్‌

16 Jan, 2021 19:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. నేడు మొత్తంగా 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిరోజు సందర్భంగా 3351 సెషన్లలో ఈ మేరకు జనాభాకు శనివారం టీకాలు వేశారు. 16755 మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. టీకా వేయించుకున్న లక్ష మందికి పైగా ప్రజల్లో ఒక్కరు ఎలాంటి దుష్ప్రభావానికి లోనుకాలేదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయగా.. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ను 12 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు కేంద్రం వెల్లడించింది. (చదవండి: పరిహారం చెల్లిస్తాం: భారత్‌ బయోటెక్‌)

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించి విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. టీకా అభివృద్ధి‌ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, సంస్థలకు అభినందనలు తెలిపారు. నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తొలి హక్కు దారులని ఉద్ఘాటించారు. ఇక టీకా వేసుకున్నంత మాత్రాన అజాగ్రత్త తగదని.. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించాల్సిదేనని ప్రధాని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌లో త్వరలోనే మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు శనివారం వెల్లడించింది.(చదవండి: వ్యాక్సిన్‌‌: డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక ప్రకటన!

మరిన్ని వార్తలు