భారత్‌కు రానున్న మరో టీకా: స్పుత్నిక్‌- వి వివరాలు!

28 Apr, 2021 12:55 IST|Sakshi

న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ - వి భారత్‌కు రానుంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబ్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్‌- వికి సంబంధించిన వివరాలు.. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ 'స్పుత్నిక్‌' ను ప్రయోగించింది. అందుకు గుర్తుగా రష్యన్‌ గవర్నమెంట్‌ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కు స‍్పుత్నిక్‌ - వి అని నామకరణం చేసింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, మెర్స్‌ వైరస్‌ లను అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేసిన రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. 

స్పుత్నిక్‌- వి వినియోగానికి కేంద్రం అనుమతి 
వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌ లో మిగిలిన కరోనా వ్యాక్సిన్ల తరహాలో స్పుత్నిక్‌ - వి  91.6 శాతం వైరస్‌ ను అడ్డుకుంటుందని రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు ఇప్పటికే 3.8 మిలియన్ల మంది ఈ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని,  97.6 శాతం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తేలిందని చెప్పింది. ఈ ప్రకటన తరువాత రెండు నెలలకే అంటే ఏప్రిల్‌ 12న స్పుత్నిక్‌ - వి వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జర్నల్‌ ఆఫ ఇండియా (డీసీజీఐ) అనుమతులు జారీచేసింది. 

రెండు డోసులు ఒకేలా ఉండవా?
స్పుత్నిక్‌ - వి అనేది ఆస్ట్రాజెనెకా టీకా తరహాలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్‌ చేసుకోవచ్చు. కానీ ఇతర కరోనా వ్యాక్సిన్ల తరహా కాకుండా స్పుత్నిక్‌ -వి విభిన్నం. ఇతర సంస్థలకు చెందిన వ్యాక్సిన్ల రెండు డోసుల మోతాదులు ఒకే విధంగా ఉంటాయి. కానీ స్పుత్నిక్‌ - వి టీకా మోతాదులు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అందులో ఒక టీకా డోసు కరోనా వైరస్‌ కు కారణమయ్యే సార్స్‌ కోవిడ్‌ -2 యొక్క స్పైక్‌ ప్రొటీన్‌ ను అడ్డుకుంటే, రెండో టీకా డోసు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుంది.

స‍్పుత్నిక్‌ - వి ధర ఎంత ?
ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన వ్యాక్సిన్ల ధర  కంటే స్పుత్నిక్‌ - వి ధర కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. స్పుత్నిక్‌ -వి కి పోటీగా ఉన్న ఆస్ట్రాజెనెకా ఒక్కడోస్‌ ఖరీదు 4డాలర్లుగా ఉంది. స‍్పుత్నిక్‌ -వి ధర 10డాలర్లుగా ఉంది. అయితే భారత్‌ లో మాత్రం వ్యాక్సిన్‌ ధర పది డాలర్ల కన్నా తక్కువగానే ఉటుందని ఇప్పటికే రష్యా సూచించింది.   

60కి పైగా దేశాలకు స్పుత్నిక్‌ - వి పంపిణీ
ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ - వి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. ఇప్పటికే స్పుత్నిక్‌- వి తయారీకి నిధుల్ని సమకూర్చిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) మనదేశానికి చెందిన 5 సంస్థలతో  850 మిలియన్ లేదా 85 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాలు కుదుర్చుకుంది.

స్పుత్నిక్‌- వి పనితీరుపై అనుమానాలా? 
స్పుత్నిక్‌- వి క్లినికల్‌ ట్రయల్స్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది ఆగస్ట్‌ 10 న రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. వాస్తవానికి క్లినికల్‌ ట్రయల్స్‌​ మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్‌ సురక్షితమా? కాదా? ఒకవేళ వ్యాక్సిన్‌ వినియోగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనేది చెక్‌ చేస్తారు. ఇక రెండో దశలో ఎంత మోతాదులో ఇవ్వాలి. మూడో దశలో ఎంతమేరకు పనిచేస్తుంది.

అసలు పనిచేస్తుందా? లేదా? అని క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. కానీ స్పుత్నిక్‌ - వి విషయంలో అలా జరగలేదు. రెండో దశ ట్రయల్స్‌లో ఉండగానే అనుమతులు ఇవ్వడంపై వ్యాక్సిన్‌ వినియోగంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ​గురించి వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో లాన్సెట్‌ అనే జర్నల్‌ తన కథనంలో టీకా సురక్షితంగా ఉండడమే కాదు ప్రభావవంతంగా పని చేస్తోందని పేర్కొంది. మరి త్వరలో భారత్‌ లో పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్‌ పనితీరు ఎలా ఉండబోతుందనే అంశంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.

మరిన్ని వార్తలు