ఏ.వై. 4.2పై ఆందోళన వద్దు: ఇన్సాకాగ్‌

8 Nov, 2021 06:22 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఏ.వై.4.2 వ్యాప్తిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఏవై.4.2 వేరియంట్‌కు సంబంధించిన కేసులు 0.1% మాత్రమేనని తెలిపింది. ‘ఏవై.4.2. వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై పరిశీలన కొనసాగుతోంది’అని ఇన్సాకాగ్‌ తెలిపింది. ప్రస్తుతానికి దేశంలో డెల్టా వేరియంట్‌ (బి.1.617.2 మరియు ఏవై.ఎక్స్‌) మాత్రమే ఆందోళనకర స్థాయిలో ఉందని తెలిపింది. అదేవిధంగా, ఏవై.4.2 వేరియంట్‌పై టీకాల ప్రభావం మిగతా డెల్టా వేరియంట్ల మాదిరిగానే ఉందని ఇన్సాకాగ్‌ తన వారాంతపు బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కొత్త వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్సాకాగ్‌ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

మరిన్ని వార్తలు