ఆక్సిజన్‌ కొరత: ప్రోనింగ్‌ చేయమంటున్న కేంద్రం

23 Apr, 2021 16:41 IST|Sakshi

ప్రోనింగ్‌ ప్రక్రియతో సౌకర్యంగా శ్వాస

ప్రోనింగ్‌కు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ నిల్వలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు అయిపోవడటంతో కోవిడ్‌ రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి స‌మ‌యంలో కోవిడ్ పేషెంట్ల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచ‌న‌లు జారీ చేసింది. శ్వాస‌ను మెరుగుపరుచుకోవ‌డానికి, ఆక్సిజ‌నేష‌న్ కోసం ప్రోనింగ్ చేయమని స‌ల‌హా ఇచ్చింది. ముఖ్యంగా స్వ‌ల్ప లక్ష‌ణాల‌తో ఇంట్లోనే చికిత్స పొందుతూ.. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏంటి ప్రోనింగ్‌...
ప్రోనింగ్‌ అనే ప్రక్రియ వల్ల సౌకర్యంగా శ్వాస తీసుకోవడం, ఆక్సిజనేషన్‌ని మెరుగుపరుస్తుందని మెడికల్‌గా నిరూపితమైనట్లు కేంద్రం తెలిపింది. ఇక ఉద‌ర‌భాగంపై బ‌రువు వేసి బోర్లా ప‌డుకోవ‌డ‌మే ఈ టెక్నిక్‌. దీనినే ప్రోనింగ్ పొజిష‌న్ అంటారు. ఇది వెంటిలేష‌న్‌ను మెరుగుప‌రుస్తుంది. రక్తంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్ 94 శాతం కంటే దిగువకు ప‌డిపోయిన‌ప్పుడే ఈ ప‌ని చేయాల‌ని ఆరోగ్య శాఖ సూచించింది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ప‌రిశీలిస్తుండ‌టం, ఉష్ణోగ్ర‌త‌, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను చూసుకుంటూ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. స‌రైన స‌మ‌యంలో ప్రోనింగ్ చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుపుకోవ‌చ్చ‌ని కూడా తెలిపింది.

ఎలా చేయాలో వివరించింది..
ప్రోనింగ్ ఎలా చేయాలో కూడా చెబుతూ.. వాటిని వివ‌రించే కొన్ని ఫోటోల‌ను కేంద్రం ట్వీట్ చేసింది. ప్రోనింగ్‌ చేయడానికి మొత్తం ఐదు తలగడలు అవసరం అవుతాయి. వీటిలో ఒకదాన్ని (త‌ల‌గ‌డ‌) మెడ కింద‌, మ‌రొక‌టి లేదా రెండు ఛాతీ నుంచి తొడ‌ల వ‌ర‌కు, మ‌రో రెండు మోకాళ్ల కింద పెట్టుకోవాల‌ని సూచించింది. అంతేకాక ఈ ప్రక్రియలో రోగిని సాధారణ బెడ్‌, చదరంగా ఉన్న షీట్‌ మీద పడుకోబెట్టాలని వెల్లడించింది.

దూరంగా ఉండాల్సిన వారు...
ఇక గ‌ర్భ‌వ‌తులు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వాళ్లు, వెన్నెముక‌కు గాయ‌మైన వాళ్లు దీనికి దూరంగా ఉంటే మంచిద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. భోజ‌నం చేసిన త‌ర్వాత కూడా ప్రోనింగ్‌ ప్రక్రియ చేయకూడదని తెలిపింది.

చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్‌’: 25 మంది మృతి

మరిన్ని వార్తలు