Covid Fourth Wave: నాలుగో వేవ్‌ నడుస్తోంది.. జాగ్రత్త!

25 Dec, 2021 05:13 IST|Sakshi

ప్రజలకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక

అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచన

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్‌ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో భారత్‌లో కోవిడ్‌ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట కోవిడ్‌ నిబంధనల అతిక్రమణ చేయవద్దని కోరింది. తక్షణమే టీకాలు తీసుకోవడం, కోవిడ్‌ సమయంలో పాటించాల్సిన పద్ధతులు(కోవిడ్‌ అప్రాప్రియేట్‌ బిహేవియర్‌– సీఏబీ) పాటించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం చేయాలని సూచించింది. ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్‌ వేరియంట్‌ అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ భార్గవ తెలిపారు.

ఏరకమైన వేరియంట్‌ సోకినా ఒకటే చికిత్స అందించాలన్నారు. ఇంతవరకు దేశంలో 358 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయని, వీటిలో 183 కేసులను విశ్లేషించగా అందులో 121 కేసులు విదేశీ ప్రయాణికులవని తెలిపింది. 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ముగ్గురైతే బూస్టర్‌ డోసు  తీసుకున్నారని వివరించింది. వీరిలో 70 శాతం మందిలో ఒమిక్రాన్‌ సోకినా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద కదలాడుతోంది. దేశీయంగా కేరళ, మిజోరాంలో జాతీయ సగటు కన్నా అధిక పాజిటివిటీ నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది.

దేశం మొత్తం మీద 20 జిల్లాల్లో(కేరళలో 9, మిజోరాంలో 8)పాజిటివిటీ రేటు 5– 10 శాతం మధ్య ఉందని తెలిపింది. ఒమిక్రాన్‌ ముంచుకొస్తున్న తరుణంలో ప్రైవేట్‌ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్‌ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్‌ సపోర్టెడ్‌ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్‌ సిద్ధంగా ఉంచారు.         ఎమర్జెన్సీ కోవిడ్‌ రెస్పాన్స్‌ ప్యాకేజ్‌2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వీటితో        ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు.  

యూపీలో రాత్రి కర్ఫ్యూ
ఈనెల 25 నుంచి ఉత్తరప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలాంటి కార్యక్రమాలకు 200కు మించి హాజరు కారాదని తెలిపారు.  రోడ్లపై తిరిగేవారికి మాస్కు తప్పనిసరి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ముంబైలో రాత్రిపూట ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్‌డోర్‌ ఫంక్షన్లలో 100 మంది లేదా హాలు సామర్ధ్యంలో 50 శాతం కన్నా ఎక్కువమంది, అవుట్‌ డోర్‌ కార్యక్రమాల్లో 250 మంది లేదా సమావేశ ప్రాంత మొత్తం సామర్ధ్యంలో 25 శాతం కన్నా ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది.   
జార్ఖండ్‌లోని రాంచీలో జనం రద్దీ

మరిన్ని వార్తలు