తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!

5 Mar, 2023 08:06 IST|Sakshi

కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్రం గణాంకాలను సేకరించింది. దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. 

దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్‌ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌​ మెడికల్‌ రీసెర్చ్‌ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్‌ఫ్లూయెంజా A సబ్‌టైప్‌ H3N2 వైరస్‌.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. 

H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఆస్పత్రి పాలుజేస్తుంది. కానీ, ఏమాత్రం ప్రాణాంతకం కాదు. గత రెండు రెండు, మూడు నెలలుగా దేశంలో కేసులు అధికంగా నమోదు కావడానికి కారణం కూడా ఇదేనని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. 

ఈ వైరస్‌ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం.. లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి.

► ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి(అందుకే కరోనా అని కంగారు పడిపోతున్నారు). పేషెంట్లు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 

► వాయు కాలుష్యం కూడా ఇది త్వరగతిన వ్యాపించడానికి ఒక కారణం.  

► ఇదేం ప్రాణాంతకం కాదు. కానీ, ఆస్పత్రి పాలుజేస్తుంది. కొందరిలో మాత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపెడుతుంది. 

► ఐసీఎంఆర్‌తో పాటు ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌(ఐఎంఆర్‌) కూడా పలు కీలక సూచనలు చేస్తోంది. 

► మరోవైపు, దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను హెచ్చరిస్తోంది.

► యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణాలకు ఆధారంగా చికిత్సను అందించాలని, మందులను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది.

► కరోనా సమయంలో అజిత్రోమైసిన్,  ఐవర్‌మెక్టిన్‌లను జనాలు ఇష్టానుసారం వాడారు. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది.  యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియల్‌ అవునా? కాదా? అని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.


లక్షణాలు గనుక కనిపిస్తే.. 

  • చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. 
  • ముఖానికి మాస్క్‌ ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. 
  • ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
  • దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి


ఇవి చేయకుండా ఉండడం బెటర్‌

  • ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం,
  • బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం
  • గుంపుగా కలిసి తినకుండా ఉండడం
  • సొంత వైద్యం.. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. కానీ, సంబంధిత వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్‌ విషయంలో.. 
మరిన్ని వార్తలు