కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు 

5 May, 2021 19:53 IST|Sakshi

రాబోయే వారాల్లో  మరింత  విజృంభించనున్న మహమ్మారి

జూన్‌ నాటికి రెట్టింపు కానున్న కోవిడ్‌ మరణాలు 

జూన్ 11 నాటికి  404,000 డెత్స్‌ నమోదయ్యే  అవకాశం 

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతి రాబోయే వారాల్లో మరింత విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల వ్యాప్తి ఇదే తరహాలో ఉంటే భారత దేశంలో  మరణాలు రెట్టింపవుతాయని అంచనా  వేస్తున్నారు.  జూన్ 11 నాటికి    కరోనా మరణాల సంఖ్య  4 లక్షలను దాటేస్తుందని  బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్‌స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం అంచనా వేసింది. మేథమెటికల్‌ మోడల్‌ ప్రకారం ఈ అంచనాకు వచ్చినట్టు ప్రకటించింది. పలువురు కోవిడ్‌ పరిశోధకులు కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. (కరోనా థర్డ్‌ వేవ్‌ తప్పదు: సంచలన హెచ్చరికలు)

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన కరోనా భారత్‌ను ముంచెత్తిన సెకండ్‌వేవ్‌ రాబోయే వారాల్లో మరింత  విజృంభించే అవకాశం ఉందని  పరిశోధన బృందం తేల్చి చెప్పింది. మరణాల సంఖ్య ప్రస్తుత స్థాయి కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.రోజూ రికార్డు స్థాయిలో కేసుల నమోదు ఇదే విధంగా సాగితే  404,000 మరణాలు  సంభవించే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం తెలిపింది. అంతేకాదు జూలై చివరి నాటికి 1,018,879 మరణాలు నమెదు కానున్నాయని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసింది. కరోనావైరస్ కేసులను ఊహించడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా భారతదేశం వంటి విశాలమైన దేశంలో, పరీక్షలు, భౌతిక దూరం వంటి ప్రజారోగ్య చర్యలను  వేగవంతం చేయవలసిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. (కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె)

రాబోయే నాలుగైదు వారాలు భారతదేశానికి చాలా కష్టమని  బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ ఆశిష్ ఝా ఆందోళన వ్యక్తం చేశారు.  దేశం తీసుకునే చర్యల్ని బట్టి ఈ విలయం ఆరు లేదా ఎనిమిదా, లేక నాలుగు వారాలా అనేది ఆధారపడి ఉంటుందన్నారు. కానీ దేశంలో సమీపంలో మహమ్మారిని నిలువరించే అవకాశాలేవీ కనిపించడంలేదన్నారు.  దేశంలో మొత్తం పాజిటివిటీ రేటు ఇప్పుడు దేశంలో 20 శాతంగా ఉంది.  కొన్ని ప్రాంతాల్లో ఇది 40శాతంగా కూడా  ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ 5శాతం కంటే ఎక్కువ వుంటే  చాలా తీవ్రతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తుంది. వాస్తవానికి ఇది చాలా అధికం. అందేకాదు చాలా కేసులు లెక్కల్లోకి రావడం లేదని కూడా ఝా వ్యాఖ్యానించారు. రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదైన తరుణంలో దీన్ని ప్రభావాన్ని ఊహించటం క‍ష్టమని  మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ సీనియర్ సైంటిస్టు జెన్నిఫర్ నుజో పేర్కొన్నారు. పరీక్షలను గణనీయంగా పెంచినప్పటికీ, వైరస్‌ సోకిన వారిందరినీ గుర్తించడం చాలా కష్టమని,  ఇది భయంకరమైన పరిస్థితి అని  ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఈ అంచనాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది.  

కాగా ఈ అంచనాల మాట ఎలా ఉన్నప్పటికీ  కోవిడ్‌-19 మరణాలకు సంబంధించి ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలోకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో 578,000 మరణాలను నమోదు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం ఢిల్లీ, ఛత్తీగడ్‌, మహారాష్ట్రలతో సహా సుమారు 12 రాష్ట్రాల్లో, రోజువారీ కొత్త  కేసులు ఇప్పటికే తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాటిజివ్‌ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వై‍ద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు