Corona In India: ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్నకేసులు.. కొత్తగా ఎన్నంటే!

10 Jun, 2022 12:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా..చాపకింద నీలా మళ్లీ విస్తరిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కోవిడ్‌ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది. దేశ విదేశాల రాకపోకలు పెరిగాయి. ప్రజలు మాస్క్‌, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. పబ్బులు,క్ల ‍్లబ్బులు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, విహార యాత్రల్లో మునిగితేలుతున్నారు. అడ్డూ అదుపు లేని ప్రయాణాలు, ఒకే చోట వేలాదిమంది గుమిగూడటం వంటి చర్యలతో వైరస్‌ మరోసారి వణికిస్తోంది.

భారత్‌లో గడిచిన 24 గంటల్లో ఏడు వేలకుపైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,584 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,813 మంది కరోనా బారినపడ్డారు. గురువారం కోవిడ్‌తో 24  మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 36,267 ఉన్నాయి. 
చదవండి: ముంచుకొస్తుంది.. జాగ్రత్త పడదాం!

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది.  మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,44,092కి చేరింది.

మరిన్ని వార్తలు