కోవిడ్‌ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం

21 Dec, 2022 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది మరింత తీవ్రం కానుందని, రాబోయే రోజులు కీలకమని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వైరస్‌ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.   

కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ భేటీలో అధికారులను కోరారు ఆయన. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారాయన.   అంతకు ముందు.. 

కోవిడ్‌ కథ ముగియలేదు. అన్ని విభాగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం.  బయటి దేశాల నుంచి వైరస్‌ వ్యాప్తి ముప్పు పొంచి ఉండడంతో నిఘా పటిష్టం చేయాలని సంబంధిత యంత్రాంగానికి తెలిపాం. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఆరోగ్య మంత్రి మాండవియా ట్వీట్‌ చేశారు. ఇక కొవిడ్‌పై ప్రధానంగా జరిగిన  హైలెవల్‌ రివ్యూలో మంత్రితో పాటు అధికారులంతా మాస్కులు ధరించి ఉండడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రొటోకాల్‌లో ఎక్కడా.. మాస్క్‌ తప్పనిసరి అనే నిబంధం లేదన్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. ఆరు ప్రధాన అంశాలపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.  గగన ప్రయాణాల ద్వారా.. దేశంలోకి కేసులు వ్యాప్తి చెందకుండా చూసుకోవడం. కొత్త సంవత్సరం నేపథ్యంలో బయటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, దేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న రోజూవారీ కేసుల శాంపిల్స్‌ను ఇన్సాకాగ్‌(INSACOG)జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు పంపడం.. ఇతర ప్రధాన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో.. భారత్‌లో 129 తాజా కరోనా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,048గా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా వైరస్‌ ప్రభావంతో ఒకరు మృతి చెందగా..  అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా వైరస్‌ బారిన పడి 5,30,677 మంది మరణించారు. 

అమెరికా, జపాన్‌, కొరియా, బ్రెజిల్‌, చైనాలలో కరోనా కేసుల విజృంభణ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చైనాలో దారుణమైన పరిస్ధితి నెలకొంది. కొత్త వేరియెంట్ల అనుమానాల నేపథ్యంలో.. శాంపిల్స్‌పై పరీక్షలు, పరిశోధనలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు