హెచ్చరిక: నెల రోజుల్లోనే మూడో వేవ్‌!

19 Jun, 2021 04:06 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో కరోనా రెండో వేవ్‌ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్‌ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చని అంచనా వేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, ఇలాగే కొనసాగితే నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఇటీవల ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మూడో వేవ్‌ తీవ్రంగా ఉండొచ్చని, మహారాష్ట్రలోనే యాక్టివ్‌ కేసుల సంఖ్య 8 లక్షలకు చేరొచ్చని.. బాధితుల్లో 10 శాతం వరకు పిల్లలు ఉండొచ్చని అధికారులు ఈ సందర్భంగా అంచనా వేశారు. కాగా మన దేశంలో వచ్చిన కరోనా రెండు వేవ్‌లలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైంది. తొలివేవ్‌లో 19 లక్షల కేసులు, రెండో వేవ్‌లో ఏకంగా 40 లక్షల కేసులు వచ్చాయి. మూడో వేవ్‌లో ఇంతకు రెండింతలుగా 80 లక్షల వరకు కేసులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా మూడో వేవ్‌ సన్నద్ధతలో భాగంగా పూర్తి ఏర్పాట్లు చేయాలని.. బెడ్లు, ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. 

జార్ఖండ్‌లోనూ కేసులు..
జార్ఖండ్‌లోనూ పలు డెల్టా ప్లస్‌ కోవిడ్‌ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కొందరు పేషెంట్ల శాంపిల్స్‌ను భువనేశ్వర్‌లోని ల్యాబ్‌కు పంపామని, జన్యు పరీక్షల్లో డెల్టా ప్లస్‌గా గుర్తించినట్టు సమాచారం వచ్చిందని తెలిపాయి. ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరం కావొచ్చని, వ్యాప్తి తీవ్రతపై నిర్ధారణ జరగాల్సి ఉందని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) మైక్రో బయాలజీ విభాగం అధిపతి మనోజ్‌ కుమార్‌ వెల్లడించారు.

స్పైక్‌ ప్రొటీన్‌ మార్పు..
కరోనా డెల్టా వేరియంట్‌ (బీ.1.167.2)లో మ్యుటేషన్లు జరిగి డెల్టా ప్లస్‌ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. ఈ వైరస్‌ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్‌’గా పిలుస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లలో చాలావరకు ఈ స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్‌లోనే మా ర్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ సోకడం, వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉత్పత్తయిన యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్‌  తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వ్యాప్తి విపరీతంగా ఉన్నా.. ప్రమాదకరంగా మారకపోవచ్చనే ఆశాభావం కనిపిస్తోంది. కాగా.. మోనో క్లోనల్‌ యాంటీబాడీస్‌ ఔషధం ప్రభావం నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తప్పించుకుంటున్నట్టుగా ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు.  

మరిన్ని వార్తలు