Covid Third Wave: మన పిల్లలు సేఫ్‌

18 Jun, 2021 01:18 IST|Sakshi

పిల్లలకు ‘మూడో ముప్పు’ తక్కువే..

డబ్ల్యూహెచ్‌వో, ఎయిమ్స్‌ అధ్యయనంలో  వెల్లడి

  • కరోనా మూడో వేవ్‌లో పిల్లలకు ప్రమాదమనే అంచనాల నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో, ఎయిమ్స్‌ సంయుక్తంగా ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై అధ్యయనం చేపట్టాయి. 
     
  • మన శరీరంలో వైరస్‌లపై పోరాడే సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటి
     
  • విటీ అంటారు. తాజా అధ్యయనంలో పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటును పెద్దవారితో పోలిస్తే పెద్ద తేడా లేదని గుర్తించారు. 
     
  • ముఖ్యంగా 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. వారు ఎక్కువగా, స్వతంత్రంగా బయటికి వెళ్తుండటం దీనికి కారణం కావచ్చని అంచనా వేశారు.
     
  • ‘ప్రస్తుతమున్న కరోనా వేరియంట్ల ద్వారా భవిష్యత్తులో వచ్చే మూడో వేవ్‌.. రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే చాన్స్‌ తక్కువ’ అని అధ్యయనం పేర్కొంది.

న్యూఢిల్లీ: పిల్లలపై కరోనా మూడో వేవ్‌ ప్రభావం మరీ భయపడినంత స్థాయిలో ఉండకపోవచ్చని వెల్లడైంది. పిల్లల్లో గతంలో ఇన్‌ఫెక్షన్‌ సోకిన (సీరో పాజిటివిటీ) రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉన్న కారణంగా.. కరోనా మూడో వేవ్‌ ముప్పు పిల్లల్లో తక్కువగానే ఉంటుందని తాజా అధ్యయనం ప్రాథమికంగా తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కలిసి ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై ఈ అధ్యయనం చేస్తున్నాయి. ఇతరుల కన్నా పిల్లలపై మూడో వేవ్‌ ముప్పు అధికంగా ఉంటుందని ఆందోళనకర వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ స్టడీ ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు.. కొంతవరకు ఆ భయాలను తొలగించే అవకాశముంది.

ఈ అధ్యయనంలో ఎలీసా కిట్స్‌తో శరీరంలో కోవిడ్‌ యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. మన శరీరంలో వైరస్‌లపై పోరాడే  సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటివిటీగా పేర్కొంటారు. ఈ అధ్యయనానికి ఎయిమ్స్‌ ఎథిక్స్‌ కమిటీ ఆమోదం లభించింది. డేటా అందుబాటులో ఉన్న 4,509 మంది వలంటీర్లలో 700 మంది 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారు కాగా.. మిగతా వారు 18 ఏళ్ల వయసువారు. వారి సగటు వయసు ఢిల్లీ (అర్బన్‌)లో 11, ఢిల్లీ (రూరల్‌)లో 12, భువనేశ్వర్‌ (ఒడిశా)లో 11, గోరఖ్‌పూర్‌ (యూపీ)లో 13, అగర్తల (త్రిపుర)లో 14గా ఉంది. వీరి నుంచి ఈ సంవత్సరం మార్చ్‌ 15 నుంచి జూన్‌ 10వ తేదీ మధ్య వివరాలు సేకరించారు.

‘పిల్లల్లో సీరో పాజిటివిటీ’ రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ప్రస్తుతమున్న వేరియంట్ల ద్వారా వచ్చే మూడో వేవ్‌ రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువ’’ అని ఆ స్టడీ తేల్చింది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ ప్రొఫెసర్లు పునీత్‌ మిశ్రా, శశికాంత్, సంజయ్‌ కే రాయ్‌ తదితరులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

స్టడీ ప్రాథమికంగా నిర్ధారించిన ముఖ్యాంశాలు

  • సీరో ప్రివలెన్స్‌ (జనాభాలో వ్యాధికారక వైరస్‌ ఉనికి) 18 ఏళ్లలోపు వయసు వారిలో 55.7%, 18 ఏళ్లపైన వయసున్న వారిలో 63.5%గా ఉంది. ఈ విషయంలో పెద్దలు, పిల్లల్లో తేడా ఎక్కువగా లేదు.
     
  • కరోనా సోకిన సమయంలో 50.9 శాతం పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.
     
  • రెండో వేవ్‌ ముందు దక్షిణ ఢిల్లీలో జనసాంద్రత అధికంగా ఉన్న ఒక కాలనీలో సీరో ప్రివలెన్స్‌ రేటు 74.7%. అలాగే ఫరీదాబాద్‌ ప్రాంతంలోని పిల్లల్లో ఆ రేటు 59.3%. రెండో వేవ్‌ తరువాత ఆ ప్రాంతాల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశముంది.
     
  • గ్రామీణ జిల్లా అయిన గోరఖ్‌పూర్‌లో సీరో ప్రివలెన్స్‌ రేటు 87.9 శాతంగా ఉంది.
     
  • సర్వే చేసిన గ్రామీణ ప్రాంత జనాభాలో సగానికి పైగా (62.3%) ఇప్పటికే వైరస్‌ బారిన పడినటుŠల్‌ నిర్ధారణ అయింది.
     
  • త్రిపురలో స్టడీలో పాల్గొన్న పిల్లల్లో 51.9% మందికి మాత్రమే సీరో ప్రివలెన్స్‌ కనిపించింది.
     
  • దేశవ్యాప్తంగా 2020 ఆగస్ట్‌లో కూడా సీరో ప్రివలెన్స్‌ సర్వే జరిపారు. అప్పుడు 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 3,021 మంది పిల్లల్లో పాజిటివిటీ రేటు 9 శాతమే కాగా, ప్రస్తుత సర్వేలో అది 60.3% కావడం గమనార్హం.
మరిన్ని వార్తలు