‘ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.. డిసెంబర్‌లో థర్డ్‌ వేవ్‌’

28 Jun, 2021 04:49 IST|Sakshi

 వెంటనే వచ్చే అవకాశం లేదు

కోవిడ్‌–19 వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎన్‌.కె. అరోరా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ)కి చెందిన కోవిడ్‌–19 వర్కింగ్‌ గ్రూపు చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా చెప్పారు. భారత ఔషధ పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో ఊహించిన దాని కంటే కాస్త ఆలస్యంగానే థర్డ్‌ వేవ్‌ వస్తుందని తేలిందని వెల్లడించారు. బహుశా ఈ ఏడాది డిసెంబర్‌లో థర్డ్‌ వేవ్‌ వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

ఆదివారం వివిధ వార్తా సంస్థలతో ఆయన మాట్లాడారు. కోవిడ్‌–19లో కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్‌ వేరియెంట్‌తో కరోనా థర్డ్‌ వేవ్‌ చెలరేగిపోవచ్చనే ఆందోళనలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ రెండింటిని లింక్‌ చేసి చూడలేమని చెప్పారు. అలాగని ఇది పూర్తిగా కొట్టి పారేసే అంశం కూడా కాదని అరోరా స్పష్టం చేశారు. ఎందుకంటే కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పు లు జరిగినప్పుడల్లా కొత్త వేవ్‌లు ముంచుకొస్తుండడం చూస్తున్నామని అన్నారు.  

రోజుకి కోటి డోసులు లక్ష్యం  
కరోనా మూడో వేవ్‌ కాస్త ఆలస్యంగా వస్తే ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వెయ్యడానికి కేంద్రానికి మరింత సమయం దొరుకుతుందని అన్నారు. వచ్చే 6 నుంచి 8 నెలల్లో రోజుకి కోటి డోసులు ఇవ్వడమే తమ లక్ష్యమని అరోరా చెప్పారు. 12–18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా ఇవ్వడానికి జైడస్‌ క్యాడిలా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామన్నారు. మూడో వేవ్‌లో ఎక్కువ మందికి వైరస్‌ సోకినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉండదని అరోరా చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్, కోవిడ్‌ నిబంధనలు పాటించడంపై అవగాహన పెరగడం వంటి వాటి వల్ల మొదటి రెండు వేవ్‌లంత తీవ్రంగా థర్డ్‌ వేవ్‌ ఉండదని అరోరా అభిప్రాయపడ్డారు.  

ఊపిరితిత్తులపైనే డెల్టా ప్లస్‌ ప్రభావం  
కోవిడ్‌–19లో మిగిలిన వేరియెంట్‌లతో పోల్చి చూస్తే డెల్టా ప్లస్‌ ఊపిరితిత్తుల్లోని కణజాలంపైనే అధిక ప్రభావం చూపిస్తుందని అరోరా తెలిపారు. అలాగని ఇది అధికంగా వ్యాప్తి చెందుతుందని, కరోనా ఎక్కువగా శరీరంపై దాడి చేస్తుందని చెప్పలేమన్నారు. ‘‘డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ ఊపిరితిత్తుల కణజాలంపైనే ప్రభావాన్ని చూపిస్తోంది. అలాగని ఈ వేరియెంట్‌ లంగ్స్‌ని డ్యామేజ్‌ చేస్తుందని చెప్పలేం.  ఈ వేరియెంట్‌ ఎక్కువగా వ్యాపిస్తుందని కూడా నిర్ధారణ కాలేదు’’అని అరోరా వివరించారు. 

మరిన్ని వార్తలు