ఏడాది తర్వాతే... బూస్టర్‌ డోసులు!

24 Oct, 2021 05:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు (ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులకు అదనంగా మరో డోసు) వచ్చే సంవత్సరం అవసరం పడొచ్చని ఢిల్లీ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులు ప్రజలను మరణాల నుంచి, ఆసుపత్రి పాలయ్యే అవకాశాల నుంచి ఎంతకాలం కాపాడుతున్నాయనే దాన్ని బట్టి బూస్టర్‌ డోసు ఎప్పుడివ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తి శరీరంలో యాంటీబాడీల ఉనికికి కొలమానంగా తీసుకోబోమని తెలిపారు. చిన్న పిల్లలకు త్వరలోనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్‌ గులేరియా శనివారం ఎన్‌డీటీవీ ఛానల్‌తో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్, యూకే, యూరోపియన్‌ యూపియన్, యూఏఈ తదితర దేశాలు ఇప్పటికే బూస్టర్‌ డోసులను సిఫారసు చేసిన అంశాన్ని ప్రస్తావించగా... ‘బూస్టర్‌ డోసు ఎప్పుడివ్వాలనే దానిపై నిర్దిష్ట సమాధానం మన వద్ద లేదు. కరోనాపై పోరాడే యాంటీబాడీలు తగ్గుతున్నాయని చెప్పి బూస్టర్‌ డోసు ఇవ్వలేం.

సమయాన్ని బట్టి నిర్ణయించాలి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి రెండో డోసు తీసుకొని ఎంతకాలమైందనేది చూడాలి. మామూలుగా ఏడాది తర్వాత బూస్టర్‌ డోసుపై ఆలోచించొచ్చు’ అని అన్నారు. ‘యూకేలో గత ఏడాది డిసెంబర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఇప్పుడక్కడ కొత్త కేసులు పెరుగుతున్నాయి కానీ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల్లో పెరుగుదల లేదు.  దీనిబట్టి అర్థమవుతోంది ఏమిటంటే 2020 డిసెంబర్‌లో తీసుకున్న టీకాలు ఇంకా పనిచేస్తున్నట్లే. టీకా రక్షణ దీర్ఘకాలికంగా ఉంటోంది.  వైరస్‌ రూ పాంతరం చెంది బలపడితే కొంచెం వెనకాముందు బూస్టర్‌ డోసులివ్వాల్సి రావొచ్చు’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు