వ్యాక్సిన్ పంపిణీకి ప్రధాని కీలక సూచనలు

17 Oct, 2020 18:59 IST|Sakshi

ఎన్నికలు, విపత్తు నిర్వహణ తరహాలో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం కండి : మోదీ

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే తరహాలోనే వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావాలంటూ ప్రధాని అధికారులకు  పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే  కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థలు పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు. దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధతను ప్రధాని శనివారం సమీక్షించారు.  (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్)

దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్‌ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని కోరారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉండాలని సూచించారు. లాజిస్టిక్స్, డెలివరీ, పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని, కోల్డ్ స్టోరేజ్ చెయిన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్‌వర్క్, వ్యాక్సినేషన్ క్లినిక్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ఇందుకు దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ప్రధాని ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్), ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర ముఖ్య అధికారులు,  ప్రభుత్వ ఇతర విభాగాలు పాల్గొన్నాయి.

కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1,12,998కు చేరుకుంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలు దాటి రికవరీ రేటు 87.78 శాతానికి చేరిందని మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు