కోవాగ్జిన్‌ : ఒక శాస్త్రవేత్తగా బాధిస్తోంది

4 Jan, 2021 19:03 IST|Sakshi

కోవాగ్జిన్‌పై రాజ‌కీయాలు వ‌ద్దు:  భార‌త్ బ‌యోటెక్ ఎండీ

టీకా తయారీలో అపార అనుభం 

ఫైజర్‌ కంటే తక్కువేమీ కాదు

తాజా వివాదం ఒక శాస్త్రవేత్తగా బాధిస్తోంది

సాక్షి హైద‌రాబాద్‌:  కరోనా వైరస్‌ నివారణలో తమ టీకా దేశంలో అత్యవసర వినియోగానికి  ఆమోదం పొందిన నేపథ్యంలో భారత్‌ బ‌యోటెక్ సంస్థ టీకా సమర్ధత, స్పందించింది. కొవాగ్జిన్‌పై వస్తున్న అపోహలు, వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను తాము దాచిపెట్టలేదని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా సోమవారం స్పష్టం చేశారు.  ప్రస్తుతం మూడో దశ‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయనీ  మార్చి నాటికి ఈ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని,  టీకాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని ఆయన వివరించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా ఫైజర్ కంటే తామేమీ తక్కువ కాదన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రక్రియపై ఐదు వ్యాసాలను ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని డాక్టర్ కృష్ణ ఎల్లా  పేర్కొన్నారు. దేశంలోతాము ప్రతిదీ క్రమపద్ధతిలో చేస్తామనీ, కానీ ప్రస్తుతవివాదం ఒక శాస్త్రవేత్తగా బాధిస్తోందన్నారు. (12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌)

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. ఎటువంటి డేటా ఇవ్వ‌కుండా ఈ టీకాకు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని విమర్శించాయి. దీంతో భార‌త్‌ బ‌యోటెక్  వ్యవస్థాపకుడు, చైర్మ‌న్ కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడారు. త‌మ సంస్థ‌కు అనుభ‌వం లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న అన్నారు.  త‌మ‌ది గ్లోబ‌ల్ కంపెనీ అని, ఇప్ప‌టికే అనేక ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 16 ర‌కాల టీకాల‌ను త‌యారు చేసిన‌ట్లు చెప్పారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. అంతేకాదు ఎబోలా  వ్యాక్సిన్‌ అసలు మానవ క్లినికల్ ట్రయల్ పూర్తి చేయలేదనీ, అయినా  లైబీరియా, గినియాలో  అత్యవసర అధికారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  అనుమతినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. (వ్యాక్సిన్‌ కోసం యాప్‌: రిజిస్ట్రేషన్‌ ఎలా అంటే?)

అలాగే తమ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదనీ, ఈ నేపథ్యంలో కోవాగ్జిన్‌పై రాజకీయాలు చేయవద్దని కృష్ణ కోరారు. బ్రిట‌న్‌తో పాటు 12 దేశాల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వహించామనీ, పాకిస్థాన్‌, నేప‌ల్‌, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ త‌మ టీకా ట్ర‌య‌ల్స్ జ‌రిగిన‌ట్లు ఆయన వెల్ల‌డించారు. తమది కేవ‌లం ఇండియ‌న్ కంపెనీ మాత్ర‌మే కాదు, నిజ‌మైన గ్లోబ‌ల్ కంపెనీ అని భార‌త్ బ‌యెటెక్ సీఎండీ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు