వ్యాక్సినేషన్‌పై చేతులెత్తేస్తున్న రాష్ట్రాలు

30 Apr, 2021 04:39 IST|Sakshi
నవీ ముంబైలో టీకా డోస్‌లు లేకపోవడంతో జనంలేక ఖాళీగా ఉన్న ఓ ప్రభుత్వ టీకా కేంద్రం

కోవిడ్‌ టీకా డోస్‌ల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే ఒకటిన ప్రారంభంకానున్న మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఇబ్బందులు తప్పేట్లులేవు. 18 ఏళ్లు వయసు నిండిన వారందరికీ కోవిడ్‌ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ సరిపడా టీకా డోస్‌లు లేకపోవడంతో అందరికీ టీకాలు వేయలేమని పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. టీకా డోస్‌లకు తీవ్రమైన కొరత ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణమని రాష్ట్రాలు స్పష్టంచేస్తున్నాయి. టీకాల లభ్యతను బట్టే మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గుజరాత్‌లో మే 1న టీకా ప్రక్రియపై సందిగ్ధత
రాష్ట్రంలో టీకాలు తక్కువ మొత్తంలో ఉండటంతో 18 ఏళ్లు నిండిన వారి కోసం ఉద్దేశించిన మే 1న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపై సందిగ్ధత ఏర్పడింది. ‘ ఫార్మా సంస్థల నుంచి టీకాలు అందగానే వ్యాక్సినేషన్‌ మొదలుపెడతాం’ అని గుజరాత్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఫార్మా సంస్థల నుంచి ప్రభుత్వానికి ఇంతవరకు డోస్‌లు రాకపోవడం గమనార్హం. ఏ తేదీలోగా డోస్‌లు అందుతాయో, ఏ తేదీన 18–45 గ్రూప్‌ వారికి టీకాలు వేస్తారనే వివరాలను ఆ ప్రకటనలో పేర్కొనలేదు. టీకా ప్రక్రియు ఇంకా రెండు రోజులే గడువు ఉన్న తరుణంలో మే 1న వ్యాక్సినేషన్‌ మొదలుకాబోదని అనుమానాలు పెరిగాయి.

పంజాబ్‌లో ఆలస్యంగా..
తమ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసే ప్రక్రియ ఆలస్యంకానుందని పంజాబ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ సింధు గురువారం వెల్లడించారు. ‘ మా వద్ద సరిపడా టీకాలు లేవు. అదే అసలు సమస్య. కనీసం పదిలక్షల డోస్‌లు ఉంటే మే 1న వ్యాక్సినేషన్‌ మొదలు పెట్టవచ్చు. కానీ ఇప్పడన్ని టీకాలు లేవు. అదే తేదీన మొదలవుతుందని చెప్పలేను’ అని బల్బీర్‌ వ్యాఖ్యానించారు. 30 లక్షల కోవిషీల్డ్‌ టీకాల కోసం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్‌ ఇచ్చామన్నారు. 45 ఏళ్ల లోపు వయసు వారికీ సరిపడా టీకాలు లేవన్నారు. ప్రతీ వారం 15 లక్షల డోస్‌లు పంపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామన్నారు.

యూపీ గ్లోబల్‌ టెండర్లు
తమ రాష్ట్రంలో ఉచితంగా అందరికీ టీకా నిమిత్తం దాదాపు 5 కోట్ల డోస్‌లను కొనుగోలుచేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. ‘ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌లకు చెరో 50 లక్షల డోస్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగేందుకు గ్లోబల్‌ టెండర్లు పిలుస్తాం. టీకాలను వృథా కానివ్వం. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లోకి టీకా తీసుకునే వారిని మాత్రమే అనుమతిస్తాం. 45 ఏళ్లు పైబడిన వారికీ వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది ’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

18–44 ఏళ్ల వారికి టీకాలు కష్టమే
18–44 ఏళ్ల వయసు వారికి ఇచ్చేందుకు సరిపడినన్ని టీకాలు ప్రస్తుతం తమ వద్ద లేవని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ స్పష్టంచేశారు. కావాల్సిన టీకాల కోసం తయారీసంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. ఢిల్లీకి ఎప్పడు టీకాలు సరఫరా చేస్తారనే షెడ్యూల్‌ను తయారీసంస్థలు ఇంకా చెప్పలేదన్నారు. వేర్వేరు తయారీసంస్థల నుంచి 1.34 కోట్ల టీకాలు కొనాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు