లంచం డిమాండ్‌; 75 రోజుల తర్వాత కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

3 Jul, 2021 21:12 IST|Sakshi

లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్‌ చేశారని భార్య ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు..  28 ఏళ్ల నరేశ్‌కు ఏప్రిల్‌ 10న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు తొలుత హాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

అనంతరం నరేశ్‌ను మీరట్‌లోని లాలా లాజ్‌పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 15న చనిపోయాడు.అయితే ఆయన భార్య గుడియాకు మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 డిమాండ్‌ చేసినట్లు తేలింది. డబ్బులు ఇవ్వని పక్షంలో మృతదేహానికి తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు చెప్పారు. దీంతో డబ్బులు లేక గుడియా తిరిగి ఊరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బంధువులు సాయంతో విషయాన్ని పోలీసులకు వివరించింది.

పోలీసులు ఇటీవల మృతుడి భార్య గుడియాతో ఫోన్‌లో మాట్లాడి ఆమెను హాపూర్‌కు రప్పించినట్లు తెలిపారు. అనంతరం హాపూర్‌ మున్సిపల్‌ సిబ్బంది ఈ నెల 2న భార్య సమక్షంలో నరేశ్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. కాగా గుడియా ఆరోపణల‍్లో నిజానిజాలు ఎంత అనేది తెలుసుకోవడానికి మీర్ట్‌ జిల్లా కలెక్టర్‌ బాలాజీ దర్యాప్తుకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు