దేశంలో కరోనా కొత్త వేరియంట్‌..పెరుగుతున్న కేసులు.. నాలుగో వేవ్ తప్పదా?

16 Mar, 2023 14:24 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది.  కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి నుంచి బయపడినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనాతో పాటు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితితో భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది.

అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‍ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే భారత్‌లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్‌లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్‌లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్‌లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్‌స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్‌ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే.

ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్‌ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. 
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్‌ సర్వే వైరల్‌

మరిన్ని వార్తలు