వృద్ధులకు ప్రాణాంతకంగా కరోనా 

15 Aug, 2021 03:40 IST|Sakshi

స్పష్టం చేస్తున్న వైద్య శాఖ గణాంకాలు 

80–89 ఏళ్ల వారిలో 10 శాతం మరణాలు 

90 ఏళ్ల పైబడిన వారిలో 9.5 శాతంగా మరణాల రేటు 

సాక్షి, ముంబై: వయోవృద్ధుల్లో కరోనా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ముంబై నగరంలో మిగతా వయసుల వారీతో పోల్చితే కరోనా సోకిన వృద్ధుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందిన వివరాల మేరకు.. ముంబైలో ఆగస్టు 12వ తేదీ వరకు 7,38,520 మంది కరోనా బారిన పడగా, వారిలో 15,975 మంది కన్నుమూశారు.

నగరంలోని 90 సంవత్సరాల పైబడినవారిలో 2,736 మందికి కరోనా సోకగా.. అందులో 260 మంది అంటే 9.50 శాతం మంది మరణించారు. 80–89 ఏళ్ల వయసు వారిలో 16,999 మందికి కరోనా సోకగా.. అందులో 1,820 మంది అంటే 10.70 శాతం మంది మృతిచెందారు. ఇక 70–79 ఏజ్‌ గ్రూప్‌లో 48,162 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,741 మంది అంటే 7.76 శాతం మంది అసువులు బాసారు. 60–69 సంవత్సరాల వయసు వారిలో 87,535 మందికి కరోనా సోకగా.. వీరిలో 4,358 మంది మరణించారు. ఈ గ్రూపులో మరణాల రేటు 4.97 శాతంగా ఉంది. 50–59 ఏళ్ల వయో గ్రూపులో 1,22,835 మంది కరోనా బారిన పడగా.. అందులో 3,364 మంది చనిపోయారు. వీరిలో మరణాల రేటు 2.73 శాతంగా నమోదైంది.

ఇక, 30–39 ఏళ్ల వయసు వారిలో 1,41,341 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 562 మంది మృత్యు వాత పడ్డారు. వైద్య శాఖ అందించిన ఈ వివరాలను బట్టి చూస్తుంటే కరోనా వైరస్‌తో వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉంటుందన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి చిన్న పిల్లల్లో కరోనా ప్రభా వం తక్కువగానే ఉంది. తొమ్మిది సంవత్సరాల లోపు వారిలో ఇప్పటివరకు 20 మంది కరోనాతో మరణించారు. 10–19 సంవత్సరాల పిల్లల్లో 41 మంది చనిపోగా, 20–29 సంవత్సరాల వయసు వారిలో 173 మందిని కరోనా బలితీసుకుంది. 

మరిన్ని వార్తలు