ఆక్స్‌ఫర్డ్‌ టీకాకే తొలి ఛాన్స్‌

27 Dec, 2020 03:49 IST|Sakshi

కోవిషీల్డ్‌ వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీకా డోసులను దేశీయంగా పుణేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిషీల్డ్‌ టీకా వినియోగానికి యూకేలో అనుమతులు లభించిన వెంటనే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీవో) నిపుణుల సమావేశం కానుంది.

భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఈ టీకా క్లినికల్స్‌ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పరిశీలించి భద్రత, వైరస్‌ నిరోధకతపై చర్చించి, దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించే విషయం పరిశీలించనుందని అధికారులు తెలిపారు. భారత్‌ బయోటెక్, ఫైజర్‌ సంస్థలు కూడా తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, భారత్‌ బయోటెక్‌ ‘కోవాగ్జిన్‌’ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నందున  అనుమతించేందుకు మరికొంత సమయం పట్టనుంది.

ఫైజర్‌ సంస్థ తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ ‘కోవిషీల్డ్‌’కే భారత్‌లో అత్యవసర వినియోగానికి తొలి అనుమతి లభించనుందని అధికారులు అంటున్నారు.  వివిధ దేశాలు, సంస్థలు తయారు చేస్తున్న టీకాలు కోవిడ్‌ వైరస్‌ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని ఇటీవల యూకే స్పష్టం చేసింది.  ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను తయారు చేసి, సిద్ధంగా ఉంచింది.

తగ్గుతున్న యాక్టివ్‌ కేసులు
దేశంలో ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల, పెరుగుతున్న రికవరీల కారణంగా యాక్టివ్‌ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం 2,81,667 ఉన్నాయని శనివారం వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఇవి 2.77% మాత్రమేనని వివరించింది. ‘కోవిడ్‌తో ఇప్పటి వరకు 97,40,108 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 95.78%గా ఉంది’ అని వివరించింది. రోజువారీ కోవిడ్‌ బాధితుల మరణాలు 6 నెలల తర్వాత మొదటిసారి  300లోపు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 251 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరుకుంది. అదేవిధంగా, కొత్తగా 22,273 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరుకుందని తెలిపింది.

మరిన్ని వార్తలు