Corona Vaccine: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు

13 May, 2021 12:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెరిగింది. రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదివరకు 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. వాక్సిన్ బెటర్ రిజల్ట్స్ కోసం గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది.

కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తర్వాత యాక్షన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ) పేర్కొంది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్‌ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. కోవాగ్జిన్‌ డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేసింది.
 

నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సిఫారసులు

  • కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి. ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
     
  • వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చిన తర్వాత కరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ మోతాదు ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తున్నారు.
     
  • చికిత్స సమయంలో ప్లాస్మా థెరపీ చేసిన రోగులకు కోలుకున్న 12 వారాల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ పేషెంట్స్‌కు నిర్దిష్ట నియమం అంటూ ఏం లేదు. కోలుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ మొదటి షాట్ ఇస్తున్నారు.
     
  • ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదు. దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే వ్యాక్సిన్‌కు గ్యాప్ తప్పనిసరి అంటున్నారు.
     
  • టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు.
     
  • కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలకు పెంచాలి. ప్రస్తుతం, 4-8 వారాల మధ్య రెండు డోస్ ఇస్తుండగా.. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, 12 వారాల విరామం ఉంటే టీకా ప్రభావాన్ని 81.3% పెంచుతుందని తెలుస్తోంది. ఈ ప్రోటోకాల్ బ్రిటన్‌లో అనుసరిస్తున్నారు.
     
  • గర్భిణీ స్త్రీలకు యాంటినెటల్ సెంటర్లలో టీకాలకు సంబంధించిన లాభాలు, నష్టాలు గురించి తెలియజేయాలి. సైడ్ ఎఫెక్ట్స్‌పై ఒక బుక్‌లెట్ వారికి అందించాలి. వారికి టీకా వేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాలిచ్చే తల్లులు డెలివరీ తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపింది.

చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్‌ హల్‌చల్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌
చదవండి: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు