కోవిన్‌ 2.0 రెడీ.. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్‌ చేసుకోండిలా!

1 Mar, 2021 19:39 IST|Sakshi

జీపీఎస్‌తో అనుసంధానం 

సమీపంలోని టీకా కేంద్రాలు తెలుసుకునే అవకాశం 

వెళ్లాల్సిన కేంద్రానికి సులభంగా చేరుకునే అవకాశం 

కరోనా టీకా సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించిన కేంద్రం 

ఇందులో నమోదు చేసుకుంటేనే టీకా 

వారం తర్వాత స్పాట్‌ రిజిస్ట్రేషన్‌!

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ కోవిన్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించింది. కోవిన్‌-2.0ను సిద్ధం చేసింది. దానిని జీపీఎస్‌కు అనుసంధానం చేసింది. దీంతో టీకా లబ్ధిదారులు వ్యాక్సిన్‌ కేంద్రాలు తమకు సమీపంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్లేందుకు వీలవుతుంది. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎలాగైతే మనం అవసరమైన చోటకు వెళ్తామో, కోవిన్‌ యాప్‌ ద్వారా మనకు సమీపంలో ఉన్న టీకా కేంద్రానికి వెళ్లడానికి అది అవకాశం కల్పిస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. 

ప్రస్తుతం కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. టీకా కేంద్రాలకు నేరుగా వచ్చి అక్కడికక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వ్యాక్సిన్‌ వేయించుకునే పద్ధతి ప్రస్తుతానికి లేదు. వారం రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక టీకా కేంద్రంలో నమోదు కార్యక్రమం చేపడతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందువల్ల అప్పటివరకు ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారు, 45-59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక రోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. 

ఎలా నమోదు చేసుకోవాలి?

  • ‘కోవిన్‌.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.  
  • అందులో లబ్ధిదారులు పేరు, తమ 10 అంకెల మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి.  
  • అనంతరం వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా అందులో నమోదు చేయాలి. 45-59 ఏళ్ల వయస్సువారు ఎంబీబీఎస్‌ డాక్టర్‌ ఇచ్చిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాలి.  
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిశాక, వ్యాక్సిన్‌ వేయించుకునే తేదీ, సమయం, టీకా కేంద్రం వంటి వివరాలు వస్తాయి. అనంతరం మొబైల్‌ నంబర్‌కు లింక్‌ వస్తుంది.  
  • ఆ లింక్‌ను లబ్ధిదారులు టీకా కేంద్రంలో చూపించడంతో పాటు గుర్తింపు కార్డులను చూపించి వ్యాక్సిన్‌ పొందొచ్చు.  
  • కోవిన్‌ 2.0 యాప్‌ ద్వారా కూడా ఈ విధంగా నమోదు చేసుకోవచ్చు. 
  • లబ్ధిదారులు తప్పనిసరిగా తమ వెంట ఫొటో, బర్త్‌ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్‌ గుర్తింపు కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తీసుకెళ్లాలి.

చదవండి:

తెలంగాణలో అంచనాలకు మించి అప్పులు

గృహ కొనుగోలుదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు