ప్రపంచ దేశాలకు అందుబాటులో ‘కోవిన్‌’

6 Jul, 2021 03:30 IST|Sakshi

కోవిడ్‌పై పోరులో మా నైపుణ్యాలను, అనుభవాన్ని ప్రపంచ దేశాలతో పంచుకుంటాం

కోవిన్‌ గ్లోబల్‌ కాంక్లేవ్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ‘కోవిన్‌’ వెబ్‌సైట్‌/యాప్‌ను ఇక అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా ఓపెన్‌ సోర్సింగ్‌ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ప్రపంచ దేశాలకు సహకరించేందుకు భారత్‌ సదా సిద్ధంగా ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిన్‌ గ్లోబల్‌ కాంక్లేవ్‌నుద్దేశించి సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఏ దేశం కూడా, ఎంత శక్తిమంతమైన దేశమైనా సరే, ఒంటరిగా కరోనా వంటి మహమ్మారులపై పోరాటం చేయలేదని ఈ అనుభవం చెబుతోందన్నారు. 

కరోనాపై భారత్‌ చేస్తున్న పోరులో సాంకేతికతది కీలకపాత్ర అని, అదృష్టవశాత్తూ సాఫ్ట్‌వేర్‌కు పెద్దగా వనరుల లోటు లేదని వ్యాఖ్యానించారు.  ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పే ‘వసుధైక కుటుంబ’ భావన భారతదేశానిదని, ప్రస్తుత మహమ్మారి సమయంలో చాలామందికి ఈ విషయం స్పష్టంగా అర్థమైందని మోదీ వ్యాఖ్యానించారు. అదే భావనతో ‘‘కోవిడ్‌ ట్రేసింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ యాప్‌ అయిన ‘కోవిన్‌’ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా ఓపెన్‌సోర్స్‌గా మారుస్తున్నాం’ అన్నారు.  కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా, ఉగాండా తదితర దాదాపు 50 దేశాలు తమ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో  ‘కోవిన్‌’ను వినియోగించే విషయంపై ఆసక్తి కనబర్చాయని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ ఇటీవల తెలిపారు.

మరిన్ని వార్తలు