చిక్కుల్లో మరో ఐఏఎస్‌..: ఇంజనీర్లపై బూతులు, అరెస్టు

29 May, 2022 02:18 IST|Sakshi

శ్రీనగర్‌: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో స్టేడియాన్నే ఖాళీ చేయించి, చివరికి శంకరగిరి మాన్యాలు పట్టిన ఓ ఐఏఎస్‌ అధికారుల జంట నిర్వాకాన్ని మర్చిపోకముందే అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కుడి భుజంగా చెప్పే ఐఏఎస్‌ అధికారి నితేశ్వర్‌ కుమార్‌ తమను అకారణంగా బూతులు తిట్టడమే గాక అక్రమంగా అరెస్టు చేయించారంటూ సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లు ఆరోపించారు.

అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు సీఈఓ అయిన నితేశ్వర్‌ మే 25న స్థానిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆ సందర్భంగా ఇంజనీర్లపై ఆయన అకారణంగా ఆగ్రహించారు. సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా తన వెంట ఉన్న ఎస్పీని ఆదేశించి ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు కూడా చేయించారు’’ అని ఇంజనీర్లు చెప్పారు. నితేశ్వర్‌ తీరును సెంట్రల్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ కేంద్ర హౌజింగ్‌ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీకి లేఖ రాసింది.

మరిన్ని వార్తలు