భార్య పేరిట రెండు కోట్ల ఇన్సూరెన్స్‌!.. పొద్దున్నే గుడికి వెళ్లమంటే అమాయకంగా..

1 Dec, 2022 17:43 IST|Sakshi
చిత్రంలో మహేష్‌(ఎడమ), శాలూ(మధ్యలో), రాథోడ్‌(కుడి)

శాలూ.. నా కోసం రోజూ ఒంటరిగా హనుమాన్‌ గుడికి వెళ్లి పూజలు చేస్తావా? అదీ స్కూటీ మీద! పదకొండు రోజులపాటు పూజలు చేయాలి.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇలా గనుక చేస్తే.. మనకు అంతా మంచి జరుగుతుందట. అది పూర్తయితే నిన్ను ఇంటికి తెచ్చేసుకుంటా అంటూ భర్త చెప్పిన మాటలతో సంతోషపడిందా భార్య. రోజూ వేకువ ఝామునే లేచి.. భర్తను తలుచుకుంటూ పూజలు చేసుకుంటూ పోయింది . ఈ క్రమంలో.. 

ఓరోజు ఆమె తోడుగా తన బంధువు కుర్రాడిని కూడా గుడికి తీసుళ్లింది. మార్గం మధ్యలో పొగమంచు కారణంగా ఆమె ఎదురుగా వస్తున్న ఎయూవీని గుర్తించలేకపోయింది. వాహనం ఢీ కొట్టడంతో శాలూ అక్కడికక్కడే కన్నుమూసింది. రాజు చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో కన్నుమూశాడు. పుట్టింటికి వెళ్లిన భార్య..  రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలియగానే కన్నీరు మున్నీరు అయ్యాడు మహేష్‌ చాంద్‌. ఆ కన్నీళ్లకు శాలూ కుటుంబం కూడా మోసపోయింది. అయితే.. 

యాక్సిడెంట్‌ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. ఇన్సూరెన్స్‌ సొమ్ము కోసమే మహేష్‌ ఆమెను హత్య చేయించాడని తేలింది. జైపూర్‌ వెస్ట్‌ డీసీపీ వందితా రానా తెలిపిన వివరాల ప్రకారం.. శాలూ, మహేష్‌కు 2015లో వివాహం అయ్యింది. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 2019లో అతనిపై గృహ హింస కేసు వేసింది కూడా. అప్పటి నుంచి భార్యకు అంటీముట్టనట్లు ఉంటూ వస్తున్నాడు మహేష్‌. అయితే.. ఈ మధ్య అతనికి ఆమెను వదిలించుకోవాలనే దుర్భుద్ధి పుట్టింది. ఆమె పేరిట భారీగా ఇన్సూరెన్స్‌ చేయించాడు.

సహజంగా చనిపోతే కోటి రూపాయలు, ప్రమాదవశాత్తూ చనిపోతే రెండు కోట్ల దాకా ఇన్సూరెన్స్‌ సొమ్ము వస్తుంది అతనికి. ఆ సొమ్ము ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నాడు. ముకేష్‌ సింగ్‌ రాథోడ్‌ అనే రౌడీ షీటర్‌తో పది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. భార్యను హత్య చేయమని పురమాయించాడు మహేష్‌. అయితే ఆ హత్య ఎవరికీ అనుమానం రావొద్దని సూచించాడు. మరోవైపు భార్యకు ఫోన్‌ చేసి 11 రోజులు వరుసగా హనుమాన్‌ గుడికి వెళ్లి పూజలు చేయమని,  తాను ఇలా చేయమన్నానని చెప్పినట్లు ఎవరితో చెప్పొద్దని బతిమాలాడు. దీంతో భర్త మనసు మారిందేమో అనుకుని ఆమె గుడికి వెళ్లడం ప్రారంభించింది.

ఈ క్రమంలో.. రాథోడ్‌ మనుషులు వాహనంతో వచ్చి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి ఆమెను హత్య చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో.. మహేష్‌తో పాటు రాథోడ్‌ను, అతని ఇద్దరి అనుచరుల్ని, యాక్సిడెంట్‌ చేసిన వాహనం ఓనర్‌తో పాటు అతని సోదరుడిని అరెస్ట్‌ చేశారు జైపూర్‌పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు