నక్సలైట్‌ ప్రాంతాల్లో సీఆర్‌పీఎస్‌ మహిళా కమాండోలు

6 Feb, 2021 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతుంటాయి. అయితే, నక్సల్స్‌ ఏరివేతలో మహిళా శక్తిని కూడా వినియోగించుకోవాలని కేంద్రం భావించింది. ఈ మేరకు నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మహిళా భద్రతా దళాలు విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడవుల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) మహిళా కమాండోలు పని చేయనున్నారు.

సీఆర్పీఎఫ్‌ 88వ మహిళా బెటాలియన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్‌పీఎఫ్‌ పేర్కొంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్‌ ఏర్పాటుచేసిన ఘనత సీఆర్‌పీఎఫ్‌కే దక్కిందని ప్రకటించింది. ఇక సీఆర్‌పీఎప్‌ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను అరికడతామని ధీమా వ్యక్తం చేసింది.

సీఆర్‌పీఎఫ్‌ మహిళా బెటాలియన్‌లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఏపీ మహేశ్వరి తెలిపారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్‌ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయని వివరించారు. విధి నిర్వహణలో భాగంగా సీఆర్‌పీఎఫ్‌ దళం అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తోందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు