తదుపరి కార్యాచరణ ఏంటి?

21 Nov, 2021 05:43 IST|Sakshi
రైతు ఉద్యమకాలంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అమృత్‌సర్‌లో కొవ్వొత్తులతో నివాళి దృశ్యం

నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా సమావేశం

26న ఢిల్లీకి తరలిరావాలని రైతులకు పిలుపు

న్యూఢిల్లీ:  మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆదివారం సింఘు బోర్డర్‌ పాయింట్‌ వద్ద సమావేశం కానుంది. ఎంఎస్పీతోపాటు ప్రతిపాదిత ట్రాక్టర్‌ ర్యాలీపై చర్చించనున్నట్లు ఎస్‌కేఎం కోర్‌ కమిటీ సభ్యుడు దర్శన్‌ పాల్‌ శనివారం చెప్పారు.

సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంట్‌లో పూర్తయ్యేదాకా రైతుల పోరాటం ఆగదని అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ వరకూ ప్రతిరోజూ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని విరమించుకోలేదని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు ప్రారంభించిన పోరాటానికి నవంబర్‌ 26న ఏడాది పూర్తి కానుంది. ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ పోరాట కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండబోదని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 26న ఢిల్లీ శివార్లలోని నిరసన కేంద్రాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది.

కేసులను ఉపసంహరించాలి: మాయావతి
కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టాన్ని తీసుకురావాలని బహుజన సమాజ్‌పార్టీ అధినేత మాయావతి శనివారం డిమాండ్‌ చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు