అమ్మా.. నీకిది తగునా..!

23 Jul, 2022 08:31 IST|Sakshi

పాలకొండ రూరల్‌: అల్లారు ముద్దుగా లాలించాల్సిన నాలుగేళ్ల చిన్నారిపై ఓ తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. చెప్పినమాట వినలేదన్న కోపంతో చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి తన విధులకు వెళ్లిపోయింది. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం ఇవ్వడంతో కట్లబంధం నుంచి విముక్తి కలిగింది. వివరాల్లోకి వెళ్తే...  

పాలకొండ ఇందిరానగర్‌ నివసిస్తున్న కెల్ల శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రోజులాగానే భర్త హోటల్‌ çపనులు చేసేందుకు వెళ్లిపోయాడు. భార్య లక్ష్మి కూడా ఓ వసతి గృహంలో తాత్కాలిక సహాయకురాలిగా పనిచేస్తోంది. ప్రతిరోజు తన నాలుగేళ్ల పెద్దకుమార్తె పూరి్ణమను అంగన్‌వాడీ కేంద్రానికి పంపించి చిన్నకుమార్తెను తీసుకుని విధులకు హాజరయ్యేది. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లనని పూర్ణిమ శుక్రవారం మారాం చేసింది.

ఎంత చెప్పిన వినకపోవడంతో సహనం కోల్పోయిన తల్లి... పూర్ణిమ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చోబెట్టి చిన్నకుమార్తెను తీసుకుని విధులకు వెళ్లిపోయింది. తల్లితండ్రులు ఇద్దరూ ఇంటి వద్ద లేకపోడం, కదిలేందుకు వీలులేకుండా ఉన్న కట్లబంధనంలో చిన్నారి కన్నీరు కార్చుతూ ఉండిపోయింది. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని తండ్రి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన వెంటనే వచ్చి కుమార్తె కట్లు విప్పాడు. భార్య చేసిన పనికి కోపంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తనపై కోపంతో తరచూ ఇటువంటి చర్యలకు పూనుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ చిన్నారి తల్లితండ్రులిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు