త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు

9 Feb, 2021 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ త్వరలో కేంద్ర కేబినెట్‌కు క్రిప్టోకరెన్సీ బిల్లును పంపనున్నట్లు సమాధానమిచ్చారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) 2018లో బ్యాంకులను నిషేధించింది. అయితే, గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

"బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల వినియోగంపై ఆర్‌బిఐ త్వరలో విధివిధానాలను తెలియజేస్తామని ప్రకటించింది. కానీ ఇది ఒక సమస్యాత్మకమైన అంశం. క్రిప్టోకరెన్సీని భారత్‌లో అరికట్టడానికి కేంద్ర ఆర్థికశాఖ ఏదైనా బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందా?" అని కర్ణాటక భాజపా ఎంపీ కె.సి.రామమూర్తి రాజ్యసభలో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఠాకూర్ మాట్లాడుతూ.. "ఆర్‌బిఐ, సెబి వంటి రెగ్యులేటరీ సంస్థలకు క్రిప్టోకరెన్సీలను నేరుగా నియంత్రించడానికి ఎటువంటి చట్టపరమైన అధికారాలు లేవు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ఆస్తులు, సెక్యూరిటీలు, వస్తువు కాదు. ప్రస్తుత చట్టాలు ఈ అంశాన్ని పరిష్కరించడానికి సరిపోవు. అందుకే ప్రభుత్వం దీనిపై‌ ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించాం. అతి త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ముందుకు ఈ బిల్లును తీసుకొస్తాం" అని ఠాకూర్ చెప్పారు.

చదవండి:
కుమారుడి ఫోటో షేర్ చేసిన ఎలోన్ మస్క్

మాస్టర్‌ కార్డు వినియోగదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు