క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు!

17 Mar, 2021 14:03 IST|Sakshi

లిస్టులో బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్‌ తదితర కరెన్సీలు 

ట్రేడింగ్‌ చేసినా, దగ్గర ఉంచుకున్నా జరిమానా! 

కొత్త బిల్లు రూపకల్పనలో కేంద్రం 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దూసుకెడుతున్న బిట్‌కాయిన్‌ తదితర క్రిప్టో కరెన్సీలపై దేశీయంగా మాత్రం కత్తి వేలాడుతోంది. భారత్‌లో వాటి భవిష్యత్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. ఓవైపు క్రిప్టోకరెన్సీలపై పూర్తి స్థాయిలో నిషేధం ఉండకపోవచ్చంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే వివరణ ఇచ్చినప్పటికీ.. మరోవైపు ఈ కరెన్సీలను నిషేధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందిస్తున్నట్లు సమాచారం. బిట్‌కాయిన్, డాగీ కాయిన్‌ లాంటి డిజిటల్‌ కరెన్సీలను నిషేధించడంతో పాటు ఆయా కరెన్సీల్లో దేశీయంగా ఎవరైనా ట్రేడింగ్‌ చేసినా, లేదా వాటిని తమ దగ్గర ఉంచుకున్నా జరిమానా విధించే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

కొత్త బిల్లు ప్రకారం క్రిప్టో కరెన్సీలను దగ్గర ఉంచుకోవడం, జారీ చేయడం, మైనింగ్‌ చేయడం, ట్రేడింగ్‌ చేయడం, ఇతరులకు బదలాయించడం వంటి లావాదేవీలన్నింటినీ క్రిమినల్‌ నేరాల పరిధిలోకి తెచ్చే ప్రతి పాదనలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ బిల్లును ప్రవేశపెడితే ఇప్పటికే క్రిప్టోకరెన్సీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు నష్టపోకుండా తమ పెట్టుబడులను విక్రయించుకుని బైటపడేందుకు ఆరు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. వర్చువల్‌ కరెన్సీలకు కీలకమైన బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని ప్రోత్సహిస్తూనే.. ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను మాత్రం నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

70 లక్షల ఇన్వెస్టర్లలో టెన్షన్‌.. 
దేశీయంగా క్రిప్టో కరెన్సీల్లో దాదాపు 70లక్షల మంది ఇన్వెస్టర్లు సుమారు 1 బిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌ చేసి ఉంటారని అంచనా. వర్చువల్‌ కరెన్సీల విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి ఈ ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. క్రిప్టోలను నిషేధించాలంటూ ప్రభుత్వం కొద్ది నెలలుగా యోచిస్తున్నప్పటికీ.. ఇటీవల నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో కాస్త ఆశలు రేకెత్తించాయి. క్రిప్టో కరెన్సీలు, బ్లాక్‌ చెయిన్, ఫిన్‌టెక్‌ లాంటి వాటికి ప్రస్తుతానికి దారులేమీ మూసేయడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అధికారిక వర్చువల్‌ కరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంటుందని, అయితే తమ వరకూ తాము మాత్రం క్రిప్టో కరెన్సీలకు దారులు మూసేయరాదనే విషయంలో స్పష్టతతో ఉన్నామని మంత్రి చెప్పారు. 

దీనిపై క్యాబినెట్‌ నోట్‌ కూడా సిద్ధమవుతోంనది ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించకుండా ట్రేడింగ్‌ను మాత్రమే నియంత్రించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆశలు నెలకొన్నాయి. అయితే, దానికి విరుద్ధంగా పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా బిల్లు రూపొందుతోందన్న వార్తలు ఇన్వెస్టర్లను కలవరపరుస్తున్నాయి. ఒకవేళ ఇది చట్టరూపంలో అమల్లోకి వచ్చిన పక్షంలో క్రిప్టోకరెన్సీలను దగ్గర ఉంచుకున్నందుకు కూడా జరిమానా విధించే తొలి పెద్ద దేశంగా భారత్‌ నిలవనుంది. చైనా కూడా మైనింగ్, ట్రేడింగ్‌ను నిషేధించినప్పటికీ ఈ వర్చువల్‌ కరెన్సీలను దగ్గర ఉంచుకున్నందుకు గాను జరిమానాలు విధించడం లేదు.

>
మరిన్ని వార్తలు