డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు, నగలు.. అవాక్కయిన ఏసీబీ అధికారులు

25 Nov, 2021 04:55 IST|Sakshi

అవినీతి అధికారుల గుట్టు రట్టు

సాక్షి, బెంగళూరు: అవినీతి అధికారుల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఓ ఇంట్లోని డ్రైనేజీ పైపులో భారీగా దాచిన నోట్ల కట్టలు, బంగారు నగల్ని చూసి అవాక్కయ్యారు. కర్ణాటకలోని కలబురగి ప్రజాపనుల శాఖ అధికారి శాంతగౌడ బిరాదార్‌ ఇంటిని ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండగా.. ఆ ఇంట్లోని డ్రైనేజీ పైపులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ప్లంబర్‌ను పిలిపించి పైపులను తొలగించగా.. అందులో దాచిన కట్టలకొద్దీ నగదు, బంగారం బయటపడ్డాయి.

కర్ణాటక వ్యాప్తంగా 60 చోట్ల ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో భారీగా సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

బెంగళూరు సిటీ, రూరల్, మండ్య, కలబురగి, బళ్లారి, మంగళూరు, గదగ్, బెళగావి, గోకాక్, దొడ్డబళ్లాపుర తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పలువురి నివాసాల్లో లెక్కలు లేని నగదు, నగలు, ఆస్తి పత్రాలను పెద్దమొత్తంలో గుర్తించారు. నాలుగో తరగతి ఉద్యోగులు వద్ద కూడా కోట్లాది ఆస్తులు బయటపడటం గమనార్హం. 

మరిన్ని వార్తలు