లోక్‌సభ టాప్‌ గేర్‌

19 Jun, 2022 06:27 IST|Sakshi

పనితీరులో గత 3 సభల కంటే మిన్న

327 గంటల చర్చ, పాల్గొన్న 2,151 మంది సభ్యులు

149 బిల్లులకు ఆమోదం

కొత్త భవనంలోనే శీతాకాల భేటీ

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రజా సమస్యలపై చర్చలు మొదలుకుని బిల్లుల ఆమోదం తదితర అన్ని అంశాల్లోనూ ప్రస్తుత లోక్‌సభ చక్కని పనితీరు కనబరుస్తోంది. చర్చల నిడివి, వాటిలో పాల్గొన్న సభ్యుల సంఖ్యతో పాటు ఆమోదించిన బిల్లుల విషయంలోనూ 14, 15, 16వ సభలతో పోలిస్తే ప్రస్తుత 17వ లోక్‌సభ మెరుగ్గా రాణించింది.

అన్నింటా ముందే...
17వ లోక్‌సభ 2019 మే 25న కొలువుదీరింది. జూన్‌ 17న తొలి సమావేశం జరిగింది. మూడేళ్లలో ఎనిమిదిసార్లు సమావేశమైంది. ఎన్నో అరుదైన రికార్డులు సాధించింది. ఏకంగా 995 గంటల పాటు కార్యకలాపాలు జరిపింది. అవి ఎన్నోసార్లు అర్ధరాత్రి దాకా కొనసాగాయి. ఆ లెక్కన 106 శాతం ఉత్పాదకత సాధించింది. ఇది 16వ లోక్‌ సభ కంటే 11 శాతం, 15వ సభ కంటే 35 శాతం ఎక్కువ!

15వ సభలో చర్చలకు తీసుకున్న సగటు సమయం 85 నిమిషాలు, పాల్గొన్న సభ్యుల సంఖ్య 921 కాగా ఈ సభలో సగటు సమయం 132 నిమిషాలకు పాల్గొన్న సభ్యుల సంఖ్య ఏకంగా 2,151కి పెరగడం విశేషం. రాష్ట్రపతి ప్రసంగంపై 14వ సభలో 266 మంది సభ్యులు మాట్లాడగా ఈసారి 518 మందికి పెరిగింది. సభ్యులు 377 రూల్‌ కింద 3,099, జీరో అవర్‌లో 4,648 అంశాలు ప్రస్తావించారు. టెక్నాలజీ వాడకంతో రూ.668.86 కోట్లు ఆదా చేసింది. స్టాండింగ్‌ కమిటీలు 419 సమావేశాలు జరిపి 4,263 సిఫార్సులు చేశాయి. 2,320 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.

కొత్తవారికి ప్రోత్సాహం
మూడేళ్ల సభా కార్యకలాపాలు పూర్తి తృప్తినిచ్చాయి. చర్చలు గతంకన్నా మెరుగ్గా జరిగాయి. కొత్త సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశాలిచ్చాం. ఎన్నోసార్లు సభా సమయాన్ని పొడిగించి ప్రత్యేక ప్రస్తావనల అంశాలకు చాన్సిచ్చాం. పార్లమెం ట్‌ కొత్త భవన నిర్మాణం చకచకా సాగుతోంది. ఈ ఏడాది శాతాకాల సమావేశాలు అందులోనే జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం     
– స్పీకర్‌ ఓం బిర్లా

మరిన్ని వార్తలు